Parenting Tips: ఏడుస్తూ అల్లరి చేసే మొండి పిల్లలను కంట్రోల్ చేసే 5 టిప్స్ ఇవిగో!
Parenting Tips: సాధారణంగా కొంతమంది పిల్లలు ఏడుస్తూ, అల్లరి చేస్తూ మొండిగా ప్రవర్తిస్తుంటారు. అయితే పిల్లలు ఏడుస్తున్నప్పుడు పేరెంట్స్ కోపంగా స్పందించడం కంటే సరైన విధంగా అర్థం చేసుకోవడం ముఖ్యం. మొండి పిల్లలను ఎలా కంట్రోల్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

మొండి పిల్లలను కంట్రోల్ చేసే బెస్ట్ టిప్స్
మొండిగా ప్రవర్తించే పిల్లలను కంట్రోల్ చేయడం తల్లిదండ్రులకు పెద్ద సవాలు లాంటిది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్‌లలో లేదా ఇంట్లో అలసటగా ఉన్నప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడవడం, చెప్పిన మాట వినకపోవడం సహజం. అయితే సైకాలజీ నిపుణుల ప్రకారం.. ఇలాంటి టైంలో పిల్లలను శిక్షించడం కంటే అర్థం చేసుకోవడం, సరైన విధంగా హ్యాండిల్ చేయడం ముఖ్యం. ఇక్కడ పిల్లల ప్రవర్తనలో మార్పు తెచ్చే 5 బెస్ట్ టిప్స్ గురించి తెలుసుకుందాం.

పిల్లల భావాలను అంగీకరించడం
పిల్లలు ఏడుస్తున్నప్పుడు.. ఏడవకు, వెంటనే ఆపేయమని చెప్పడం కంటే, నీకు కోపంగా ఉందా?, ఏదైనా కావాలా? అని ప్రశాంతంగా అడగడం మంచిది. ఇలా చేయడం వల్ల పిల్లలు తమ భావాలను పేరెంట్స్ అర్థం చేసుకుంటున్నారని నమ్ముతారు. ఇది వారి మొండితనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పిల్లల భావాలను వ్యక్తపరచడానికి అవకాశం ఇవ్వడం మంచిది.
శాంతంగా స్పందించడం
పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా కోపంగా అరవడం మొదలుపెడితే పరిస్థితి మరింత దిగజారుతుంది. దానికి బదులు సైలెంట్ గా… కానీ, గట్టిగా నియమాన్ని చెప్పడం అవసరం. ఈ ప్రవర్తన సరైనది కాదు అని స్పష్టంగా చెప్పాలి. పిల్లలు పెద్దల ప్రవర్తనను గమనిస్తారు కాబట్టి, తల్లిదండ్రుల శాంతమైన వైఖరి వారిని కూడా క్రమంగా ప్రశాంతంగా మారుస్తుంది.
దృష్టి మళ్లించడం
చిన్న పిల్లలు చాలా త్వరగా దృష్టి మారే స్వభావం కలిగి ఉంటారు. ఒక ఆట వస్తువు ఇవ్వడం, లేదా బయటకి తీసుకెళ్లడం వంటి చిన్న మార్పులతో వారి ఏడుపు లేదా మొండితనం తగ్గించవచ్చు. ఒక పాప బొమ్మ కోసం ఏడుస్తుంటే, మరో ఇంట్రెస్టింగ్ వస్తువు చూపించడం ద్వారా వారి దృష్టిని మళ్లించవచ్చు.
స్పష్టమైన రొటీన్
పిల్లలకు నిద్ర, భోజనం, ఆటల సమయం అంటూ స్పష్టమైన రొటీన్ ఉండాలి. దానివల్ల అనవసరంగా వచ్చే ఏడుపు, అసహనం తగ్గుతుంది. అలాగే ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనే స్పష్టమైన సరిహద్దులు పెట్టడం కూడా ముఖ్యం. నియమాలు స్థిరంగా ఉంటే పిల్లలు వాటిని అంగీకరించడం నేర్చుకుంటారు.
పాజిటివ్ రివార్డ్స్ ఇవ్వడం
పిల్లలు మంచి ప్రవర్తన చూపించినప్పుడు చిన్న చిన్న ప్రోత్సాహకాలు ఇవ్వడం మంచిది. అంటే అవి ఖరీదైన బహుమతులే కావాల్సిన అవసరం లేదు. ఒక ప్రశంస, హగ్ లేదా నువ్వు చాలా చక్కగా చేశావ్ వంటి మాటలు కూడా వారికి చాలా పెద్ద ప్రోత్సాహంగా ఉంటాయి. నిపుణుల ప్రకారం పిల్లలు శిక్షల కంటే ప్రోత్సాహానికే ఎక్కువగా స్పందిస్తారు.

