- Home
- Jobs
- Government Jobs
- Success Story : సర్కార్ సాయంతో చదివి.. యూపిఎస్సి ర్యాంక్ సాధించిన రైతు కూతురు
Success Story : సర్కార్ సాయంతో చదివి.. యూపిఎస్సి ర్యాంక్ సాధించిన రైతు కూతురు
ఓ రైతు కూతురు ముఖ్యమంత్రి అభ్యుదయ యోజన పథకం ద్వారా ప్రభుత్వ సహకారం పొంది పట్టుదలతో చదువుకుంది. దీంతో మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ-సీఏపీఎఫ్ పరీక్షలో పాసై అసిస్టెంట్ కమాండెంట్ అయ్యారు. ఆమె స్ఫూర్తిదాయక కథను తెలుసుకుందాం.

ఇది కదా సక్సెస్ అంటే..
Success Story : ఒకప్పుడు పొలం గట్ల మీద కలలు కన్న రైతు కూతురు, ఇప్పుడు దేశ భద్రతా బాధ్యతలు చేపట్టబోతోంది. ఇది కేవలం ఒక పరీక్షలో పాసైన కథ కాదు. సరైన సమయంలో సరైన చేయూత దొరికితే, పరిస్థితులు కూడా దారి ఇస్తాయనే నమ్మకానికి నిదర్శనం. ఉత్తర ప్రదేశ్ కు చెందిన పూజా సింగ్ విజయం, సంకల్పం బలంగా ఉంటే వనరుల కొరత గమ్యాన్ని ఆపలేదని నిరూపించింది.
ముఖ్యమంత్రి అభ్యుదయ యోజనతో మారిన తలరాత
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ అమలుచేస్తున్న ముఖ్యమంత్రి అభ్యుదయ యోజన పథకం పూజా సింగ్ పోరాటానికి ఒక దారి చూపింది.తండ్రి ఒక సాధారణ రైతు… ఆర్థికంగా బాగా వెనుకబడిన కుటుంబంలో పుట్టింది పూజ. తక్కువ ఆదాయంతో కుటుంబాన్ని నడపుతున్న తండ్రి ఉన్నత స్థాయి పోటీ పరీక్షలకు కూతురును సిద్ధం చేయడం అంత సులభం కాదు. కానీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెచ్చిన ఈ పథకం పూజకు మూసుకుపోయిన దారులను తెరిచింది. "ముఖ్యమంత్రి అభ్యుదయ యోజన నా కలలకు దారి చూపింది" అని పూజ స్వయంగా చెబుతున్నారు.
పూజా సింగ్ కు ఉచిత కోచింగ్
పూజ 12వ తరగతి వరకు ఢిల్లీలో చదివారు. ఆ తర్వాత చదువు కోసం ఢిల్లీలో ఉండటం ఆర్థికంగా సాధ్యపడలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో జౌన్‌పూర్‌కు తిరిగి వచ్చి, టీడీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. చాలా మంది కలలు చెదిరిపోయే మలుపు ఇది, కానీ పూజ ఓటమిని అంగీకరించకుండా కొత్త అవకాశాలను వెతికారు.
పోటీ పరీక్షలు రాయాలనుకున్న పూజకు 2024లో ముఖ్యమంత్రి అభ్యుదయ యోజన గురించి తెలిసింది. ఆమె మే 2024లో ఈ పథకం ద్వారా సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకానికి ఎంపికైన పూజ జూన్ 2024 నుంచి ఉచిత కోచింగ్ పొందారు.
ఈ పథకం కింద ఆమెకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం లభించింది. రెగ్యులర్ క్లాసులు, పద్ధతి ప్రకారం సిలబస్, నిరంతర రివిజన్ ఆమె ప్రిపరేషన్‌ను పటిష్టం చేశాయి. కాలేజీ తర్వాత రోజూ సాయంత్రం గంటన్నర పాటు క్లాసులు పూజ దినచర్యలో భాగమయ్యాయి.
ఒకవేళ ప్రైవేట్ కోచింగ్ తీసుకోవాల్సి వస్తే రూ. 1 నుంచి 1.5 లక్షల వరకు ఖర్చయ్యేదని, అది తమ కుటుంబానికి అసాధ్యమని పూజ చెబుతున్నారు. అభ్యుదయ యోజన ఈ ఆర్థిక భారాన్ని పూర్తిగా తొలగించింది. నిరుపేద రైతుబిడ్డకు విజయాన్ని సాధించిపెట్టింది.
మొదటి ప్రయత్నంలోనే యూపిఎస్సి ర్యాంక్
పట్టుదల, క్రమశిక్షణతో పాటు సరైన మార్గదర్శకత్వం ఫలితంగా పూజా సింగ్ తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ-సీఏపీఎఫ్ పరీక్షలో పాసై అసిస్టెంట్ కమాండెంట్ అయ్యారు. ఈ విజయం కేవలం పూజది మాత్రమే కాదు, అర్హులైన యువతకు సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పే వ్యవస్థది కూడా.
పూజ విజయంతో ఆమె కుటుంబంలో ఆనందభరిత వాతావరణం నెలకొంది… తల్లిదండ్రులు కూతురిని చూసి గర్విస్తున్నారు. గ్రామంలో ప్రజలు ఆమెను స్ఫూర్తిగా చూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సరిగ్గా క్షేత్రస్థాయికి చేరితే, గ్రామ వీధుల నుంచి కూడా అధికారులు వస్తారనే సందేశాన్ని ఆమె కథ ఇస్తోంది.
వేలాది మంది యువత అవకాశం
సాంఘిక సంక్షేమ శాఖ నడుపుతున్న ముఖ్యమంత్రి అభ్యుదయ యోజన, ఈ రోజు కేవలం ఒక పథకం కాదు, వేలాది మంది యువతకు ఆశగా మారింది. ఐఏఎస్, పీసీఎస్, నీట్, జేఈఈ, సీఏపీఎఫ్ లాంటి పరీక్షల ప్రిపరేషన్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలో ఆగడం లేదు. పోరాటం ఎంత పెద్దదైనా, అవకాశం, కష్టం కలిస్తే విజయం ఖాయమని పూజా సింగ్ విజయం చెబుతోంది.

