ప్రపంచంలో జైలు లేని దేశం ఏదో తెలుసా.? అత్యంత సురక్షితమైన ప్రదేశం ఇదే
Vatican city: నేరాలను అదుపులో ఉంచేందుకు ఆయా దేశాలు పటిష్టమైన చట్టాలను చేస్తాయి. నేరస్థులను బంధించేందుకు జైళ్లను నిర్మిస్తారు. అయితే ప్రపంచంలో జైలు లేని ఓ దేశం ఉందని మీకు తెలుసా.?

జైలు లేని దేశం
ప్రపంచంలో ఒక్క దేశం ఉంది, అక్కడ జైలు లేదు, పెద్ద నేరాలు కూడా దాదాపు కనిపించవు. దొంగతనం, గొడవలు, దాడులు వంటి సంఘటనలు చాలా అరుదు. దేశం చిన్నదైనా, చట్టం అమలు చేసే విధానం బలంగా ఉండటం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అదేదో కాదు ప్రపంచంలోనే అతిచిన్న దేశమైన వాటికన్ సిటీ.
కచ్చితమైన నియంత్రణ
వాటికన్ సిటీ ప్రపంచంలో అత్యంత చిన్న సార్వభౌమ దేశం. విస్తీర్ణం కేవలం 0.44 చదరపు కిలోమీటర్లు. జనాభా సుమారు 800 నుంచి 900 మంది వరకు ఉంటుంది. చిన్న జనాభా ఉండటం వల్ల ప్రతి చర్యపై పర్యవేక్షణ సులభం అవుతుంది. ఈ నియంత్రణ కారణంగా నేరాలు జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది.
జైలు ఎందుకు లేదు?
వాటికన్ సిటీలో శాశ్వత జైలు లేదు. విచారణ కోసం కొద్ది గదులు మాత్రమే ఉంటాయి, అవి కూడా తాత్కాలికంగా వినియోగిస్తారు. ఎవరైనా నేరం చేస్తే వారిని ఇటలీ జైళ్లకు పంపిస్తారు. దేశం చిన్నగా ఉండటం, నిత్యం భద్రత గట్టి ఉండటం వల్ల పెద్ద నేరాలు చోటు చేసుకోవడం అరుదు.
ఆధ్యాత్మిక జీవన శైలి ప్రభావం
ఇక్కడ జీవనం పూర్తిగా ఆధ్యాత్మిక కార్యకలాపాల చుట్టు తిరుగుతుంది. ఎక్కువ మంది మత సేవలో ఉండటం వల్ల నియమ నిబంధనలు స్వయంగా పాటిస్తారు. అందువల్ల దొంగతనం వంటి చిన్న సంఘటనలు కూడా చాలా అరుదుగా జరుగుతాయి. ఎప్పుడైనా చిన్న నేరం జరిగినా దాన్ని ఇటలీ న్యాయ వ్యవస్థ పరిష్కరిస్తుంది.
కట్టుదిట్టమైన భద్రత
వాటికన్ సిటీలో స్విస్ గార్డులు సహా ప్రత్యేక భద్రతా బృందాలు విధులు నిర్వహిస్తాయి. ప్రతి ముఖ్య ప్రదేశం కట్టుదిట్టమైన పర్యవేక్షణలో ఉంటుంది. అనుమానాస్పద చర్య కనబడగానే వెంటనే నియంత్రించగల సామర్థ్యం ఉంటుంది. ఈ వ్యవస్థ వాటికన్‌ను ప్రపంచంలో అత్యంత సురక్షిత ప్రదేశాల్లో ఒకటిగా నిలబెడుతుంది.

