- Home
- International
- USA: అమెరికా సైన్యానికి వేరే దేశాల్లో ఏం పని.? ఆ దేశాలు వారిని ఎందుకు అనుమతిస్తాయి.?
USA: అమెరికా సైన్యానికి వేరే దేశాల్లో ఏం పని.? ఆ దేశాలు వారిని ఎందుకు అనుమతిస్తాయి.?
USA: అమెరికా తన సైన్యాన్ని కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం చేయదు. యూరప్, ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఇలా ప్రపంచంలోని 80కిపైగా దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. అయితే వేరే దేశాల్లో అమెరికాకు ఏం పని అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా.?

ప్రపంచ వ్యూహంలో భాగమే అమెరికా సైన్యం
అమెరికా ఇతర దేశాల్లో సైన్యాన్ని ఉంచడాన్ని “ఫార్వర్డ్ ప్రెజెన్స్” వ్యూహంగా పిలుస్తారు. అంటే ప్రమాదం అమెరికా వద్దకు వచ్చే వరకు ఎదురుచూడకుండా, ముందుగానే కీలక ప్రాంతాల్లో సైన్యాన్ని సిద్ధంగా ఉంచడం. ఇలా చేయడం వల్ల ప్రపంచంలో ఎక్కడ యుద్ధం, ఉగ్రదాడి లేదా భద్రతా సంక్షోభం వచ్చినా అమెరికా వెంటనే స్పందించగలుగుతుంది. ఈ సైనిక స్థావరాలు తాత్కాలిక శిబిరాలు కావు. ఇవి దశాబ్దాలుగా కొనసాగుతున్న భారీ రక్షణ వ్యవస్థలో భాగం.
మిత్రదేశాల భద్రత కోసం సైనిక స్థావరాలు
అమెరికా సైన్యం ఇతర దేశాల్లో ఉండటానికి ప్రధాన కారణం తమ మిత్రదేశాలకు రక్షణ కల్పించడం. ఉదాహరణకు జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలు అమెరికా సైన్యాన్ని తమ దేశాల్లో ఉంచేందుకు అనుమతిస్తాయి. ఎందుకంటే వారికి నార్త్ కొరియా, చైనా నుంచి నుంచి భద్రతా ముప్పు ఉందని భావిస్తుంటారు. అలాగే యూరప్‌లోని అమెరికా సైనిక స్థావరాలు నాటో సభ్య దేశాలకు మద్ధతు ఇస్తూ, రష్యా నుంచి వచ్చే ప్రమాదాలను అడ్డుకునే రక్షణ గోడలా పనిచేస్తాయి.
అణు భద్రతా కవచంగా అమెరికా
అమెరికా మిత్రదేశాలకు “న్యూక్లియర్ అంబ్రెలా” అనే అణు భద్రతా హామీ కూడా ఇస్తుంది. అంటే ఎవరు ఆ దేశాలపై అణు దాడి చేస్తే, అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందనే సంకేతం. దీంతో చిన్న దేశాలు తమకు తామే భారీ అణ్వస్త్ర ప్రోగ్రామ్‌లు అభివృద్ధి చేయాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే శత్రు దేశాలు కూడా దాడి చేయడానికి వెనుకడుగు వేస్తాయి.
అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందన
ఇతర దేశాల్లో ముందుగానే సైనిక బలగాలు ఉండటం వల్ల అమెరికా అత్యవసర పరిస్థితుల్లో చాలా వేగంగా చర్యలు తీసుకోగలుగుతుంది. ఉదాహరణకు యుద్ధం, ఉగ్రదాడి, ప్రకృతి విపత్తు వంటి ఘటనలు జరిగితే అమెరికా ప్రధాన భూభాగం నుంచి సైన్యాన్ని పంపేందుకు సమయం పడుతుంది. కానీ సమీప దేశాల్లో ఉన్న స్థావరాల నుంచి వెంటనే సైనికులు, యుద్ధవిమానాలు, ఆయుధాలు పంపే అవకాశం ఉంటుంది. ఇటీవల ఇరాన్‌లో జరిగిన యుద్ధమే దీనికి సాక్ష్యం. ఇరాన్‌పై అమెరికా భూభాగంపై నుంచి కాకుండా.. దుబాయ్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న స్థావరాల నుంచి దాడులు చేసిన విషయం తెలిసిందే.
వ్యాపార మార్గాలు, ఆర్థిక ప్రయోజనాల రక్షణ
అమెరికా సైనిక వ్యూహం కేవలం రక్షణకే పరిమితం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కూడా ముడిపడి ఉంటుంది. ప్రపంచ వాణిజ్యం సముద్ర మార్గాలు, చమురు రవాణా మార్గాలు, అంతర్జాతీయ ట్రేడ్ నెట్‌వర్క్‌లపై ఆధారపడి ఉంటుంది. అందుకే కీలక సముద్ర మార్గాలు, చమురు ప్రాంతాల దగ్గర అమెరికా సైనిక ఉనికిని కొనసాగిస్తుంది. దీని ద్వారా ప్రపంచ వ్యాపార ప్రవాహం సజావుగా సాగడంతో పాటు, అమెరికా ఆర్థిక ప్రయోజనాలు, విదేశాల్లో ఉన్న తమ పౌరుల భద్రతను కూడా కాపాడుతుంది.

