- Home
- International
- అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు.? భారతీయులపై వీటి ప్రభావం ఏంటి?
అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు.? భారతీయులపై వీటి ప్రభావం ఏంటి?
US Midterm Elections: అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మిడ్‌టర్మ్ ఎన్నికలు అంటే ఏంటి? ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఎలాంటి మార్పులు వస్తాయి? భారత్‌కు వీటితో ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం.

అమెరికా రాజకీయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అమల్లో ఉంది. కానీ అమెరికాలో అధ్యక్ష తరహా పాలన ఉంటుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించారు. అవి కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. కార్యనిర్వాహక వ్యవస్థకు అధ్యక్షుడు నాయకత్వం వహిస్తారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రభుత్వ విధానాలను అమలు చేయడం, దేశ పరిపాలన నిర్వహించడం ఈ వ్యవస్థ బాధ్యత. శాసన వ్యవస్థను కాంగ్రెస్ అంటారు.
ఇందులో రెండు సభలు ఉంటాయి. అవే ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సెనేట్. ప్రతినిధుల సభలో మొత్తం 435 మంది సభ్యులు ఉంటారు. వీరిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ప్రతి రెండేళ్లకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర జనాభా ఆధారంగా ఆయా రాష్ట్రాలకు ఈ సభలో స్థానాలు కేటాయిస్తారు. అందుకే కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి పెద్ద రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఉంటాయి. ఇక సెనేట్‌లో మొత్తం 100 మంది సభ్యులు ఉంటారు. అమెరికాలోని ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు చొప్పున సెనేటర్లు ఎన్నికవుతారు. వీరి పదవీకాలం ఆరేళ్లు. ప్రతి రెండేళ్లకు సెనేట్‌లో మూడింట ఒక వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మూడో విభాగమైన న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టుతో పాటు ఇతర ఫెడరల్ కోర్టులు ఉంటాయి. అమెరికాలో ఏదైనా కొత్త చట్టం తీసుకురావాలంటే ముందుగా కాంగ్రెస్‌లోని రెండు సభలు ఆమోదించాలి. ఆ తర్వాత అధ్యక్షుడు సంతకం చేస్తేనే అది చట్టంగా మారుతుంది. అంటే అధ్యక్షుడికి అన్ని అధికారాలు ఉండవు. కాంగ్రెస్, న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయగలవు.
మిడ్‌టర్మ్ ఎన్నికలు అంటే ఏమిటి? ఎలా నిర్వహిస్తారు?
అమెరికా అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్లు. ఈ పదవీకాలం మధ్యలో, అంటే రెండేళ్లు పూర్తయిన తర్వాత జరిగే ఎన్నికలనే మిడ్‌టర్మ్ ఎన్నికలు అంటారు. ఇవి అధ్యక్ష ఎన్నికలు కాకపోయినా దేశ రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఈ ఎన్నికల్లో ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. సెనేట్‌లో 100 స్థానాలకు గాను సుమారు 33 లేదా 34 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారు. వీటితో పాటు పలు రాష్ట్రాల్లో గవర్నర్ పదవులు, స్థానిక సంస్థల స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి.
అమెరికాలో ప్రధానంగా రిపబ్లికన్, డెమోక్రటిక్ అనే రెండు పార్టీలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఈ పార్టీలు రాష్ట్రాల వారీగా ప్రైమరీలు లేదా కాకస్‌లను నిర్వహించి తమ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారు. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. అమెరికాలో ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎక్కువగా రాష్ట్రాలు, స్థానిక అధికారుల చేతుల్లో ఉంటుంది. అందువల్ల ఒక్కో రాష్ట్రంలో ఓటరు నమోదు నిబంధనలు, ఓటింగ్ విధానాలు వేర్వేరుగా ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్, ముందస్తు ఓటింగ్, ఎన్నికల రోజు నేరుగా ఓటు వేయడం వంటి అవకాశాలు ఉంటాయి. స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలు ఒకేసారి జరగడంతో ఒక్కో ప్రాంతంలో ఓటర్లకు వేర్వేరు బ్యాలెట్లు ఉంటాయి. అందుకే తుది ఫలితాలు వెల్లడవడానికి కొన్ని రోజులు పట్టవచ్చు.
2026 ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి?
ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్ పార్టీకి స్వల్ప ఆధిక్యం ఉంది. సెనేట్‌లో రిపబ్లికన్లకు 53 స్థానాలు ఉండగా, డెమోక్రాట్లకు 47 స్థానాలు ఉన్నాయి. సెనేట్‌పై పట్టు సాధించాలంటే డెమోక్రాట్లు కనీసం నాలుగు స్థానాలు అదనంగా గెలుచుకోవాల్సి ఉంటుంది. టెక్సాస్, మైనే, ఒహియో, అలాస్కా వంటి రాష్ట్రాల్లో జరిగే పోటీ ఈ విషయంలో కీలకం కానుంది. మరోవైపు ప్రతినిధుల సభలోనూ రిపబ్లికన్ల మెజారిటీ చాలా స్వల్పంగా ఉంది. ఈ నేపథ్యంలో డెమోక్రాట్లు తిరిగి సభపై పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.
సాధారణంగా అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడి పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుంటుంది. గత 23 మిడ్‌టర్మ్ ఎన్నికలను పరిశీలిస్తే అధ్యక్షుడి పార్టీ సగటున ప్రతినిధుల సభలో 27 స్థానాలు, సెనేట్‌లో మూడు స్థానాలు కోల్పోయింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ధరల పెరుగుదల, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితులు దీనికి ప్రధాన కారణాలుగా ఉంటాయి.
2025లో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలనే లక్ష్యంతో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) ద్వారా భారీగా ఉద్యోగాల కోతలు చేపట్టారు. సుమారు 2.64 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గినట్లు అంచనాలు ఉన్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన ధరలు అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు, హోర్ముజ్ జలసంధిలో చమురు రవాణాకు ఎదురైన అంతరాయాలు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు, చైనాపై భారీ టారిఫ్‌లు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశాలన్నీ ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి.
ఈ ఎన్నికల్లో గెలుపోటములు ట్రంప్ ప్రభుత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ నిలబెట్టుకుంటే అధ్యక్షుడు ట్రంప్‌కు తన విధానాలను అమలు చేయడం సులభమవుతుంది. కొత్త చట్టాల రూపకల్పన, బడ్జెట్ ఆమోదం వంటి విషయాల్లో ఆయన ప్రభుత్వానికి ఎక్కువ మద్దతు లభిస్తుంది. ఒకవేళ డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభపై పట్టు సాధిస్తే పరిస్థితులు మారిపోతాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం వారికి లభిస్తుంది. ముఖ్యంగా వాణిజ్య సుంకాలు, విదేశాంగ విధానాలు, యుద్ధ నిర్ణయాలు, ప్రభుత్వ ఖర్చులపై విచారణలు చేపట్టవచ్చు. దీంతో ట్రంప్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
అంతేకాదు, ప్రతినిధుల సభలో మెజారిటీ సాధిస్తే అధ్యక్షుడిపై అభిశంసన ప్రక్రియను ప్రారంభించే అధికారం కూడా డెమోక్రాట్లకు ఉంటుంది. అయితే అభిశంసన తీర్మానం ఆమోదం పొందడం, అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించడం రెండూ వేర్వేరు ప్రక్రియలు. ప్రతినిధుల సభ అభిశంసనకు ఆమోదం తెలిపినా, సెనేట్‌లో విచారణ జరగాలి. అధ్యక్షుడిని దోషిగా నిర్ధారించి పదవి నుంచి తొలగించాలంటే సెనేట్‌లో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. అందువల్ల ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందనేది ట్రంప్ మిగిలిన రెండేళ్ల పాలనకు చాలా కీలకం. ఎన్నికల ఫలితాలు 2028లో జరిగే తదుపరి అధ్యక్ష ఎన్నికల వరకు అమెరికా ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపనున్నాయి.
అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు భారత్‌కు ఎందుకు కీలకం?
అమెరికా తీసుకునే వాణిజ్య, విదేశాంగ, రక్షణ నిర్ణయాలు భారత్‌పైనా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలు, హెచ్-1బీ వీసాలు, దిగుమతి సుంకాలు, రక్షణ రంగంలో ఇరు దేశాల సహకారం వంటి అంశాలు కీలకంగా మారాయి. అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త దరఖాస్తులపై భారీగా ఫీజులు విధించడం భారతీయ నిపుణులు, ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతోంది. హెచ్-1బీ వీసాలు పొందుతున్న వారిలో భారతీయుల వాటా 70 శాతానికి పైగా ఉండటంతో ఈ నిర్ణయాలు మన దేశానికి ముఖ్యమైనవిగా మారాయి. అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన భారత ఐటీ సేవల రంగానికి కూడా ఇది సవాలుగా మారింది.
వాణిజ్య రంగంలోనూ భారత్‌కు అమెరికాతో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో 2025లో భారత వస్తువులపై అమెరికా 50 శాతం వరకు సుంకాలు విధించింది. అనంతరం ఇరు దేశాల మధ్య చర్చలతో 2026లో తాత్కాలికంగా 18 శాతానికి తగ్గించింది. అయితే ఈ విషయంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు, పరస్పర ప్రయోజనాలు కీలకంగా ఉంటాయి. మరోవైపు రక్షణ, సాంకేతిక రంగాల్లో భారత్, అమెరికా సంబంధాలు బలపడుతున్నాయి. చైనా సెమీకండక్టర్ రంగంలో ఆధిపత్యాన్ని ఎదుర్కోవడం, కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా TRUST (ట్రాన్స్ఫార్మింగ్ రిలేషన్షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ) కార్యక్రమం చేపట్టారు.
ఈ నేపథ్యంలో డెమోక్రాట్లు ప్రతినిధుల సభపై పట్టు సాధిస్తే ట్రంప్ ప్రభుత్వం విధించిన దిగుమతి సుంకాలు, విదేశాంగ విధానాలపై మరింత పర్యవేక్షణ ఉండవచ్చు. దీంతో భారత ఎగుమతిదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే అమెరికాలో రక్షణాత్మక వాణిజ్య విధానాలకు రెండు పార్టీల నుంచి కూడా మద్దతు ఉండటంతో సుంకాల విషయంలో పూర్తిస్థాయి మార్పులు వస్తాయని చెప్పలేం.





