- Home
- International
- Modi Trump: 16 నెలల తర్వాత తొలిసారి కలిసిన మోదీ, ట్రంప్.. అంతా సెట్ అయినట్లేనా.?
Modi Trump: 16 నెలల తర్వాత తొలిసారి కలిసిన మోదీ, ట్రంప్.. అంతా సెట్ అయినట్లేనా.?
Modi Trump: ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 (G7) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్నారు. దాదాపు 16 నెలల తర్వాత ఇద్దరు నేతలు ప్రత్యక్షంగా సమావేశం కావడం అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

ఆత్మీయంగా పలకరించుకున్న ఇద్దరు నేతలు
ఫ్రాన్స్‌లోని ఇవియన్ లెస్ బెయిన్స్‌లో జరిగిన ఈ సమావేశంలో మోదీ, ట్రంప్ మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. సదస్సు హాల్‌లోకి వచ్చిన మోదీని ట్రంప్ స్వయంగా పలకరించారు. ఇద్దరూ కరచాలనం చేసుకోవడంతో పాటు కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నట్లు అక్కడి దృశ్యాల్లో కనిపించింది. ట్రంప్ మోదీ భుజంపై స్నేహపూర్వకంగా తట్టడం కూడా చర్చనీయాంశమైంది.
భారత్-అమెరికా సంబంధాలకు కీలక సమయం
ఇటీవలి నెలల్లో భారత్-అమెరికా సంబంధాల్లో కొన్ని అంశాలపై విభేదాలు కనిపించాయి. ముఖ్యంగా వాణిజ్య సుంకాలు, ఎగుమతులపై అమెరికా తీసుకున్న నిర్ణయాలు రెండు దేశాల మధ్య చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో మోదీ-ట్రంప్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై పురోగతి సాధించే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి.
జీ7లో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం
భారత్ జీ7 సభ్య దేశం కాకపోయినా, గత కొన్ని సంవత్సరాలుగా ఈ సధస్సుకు ప్రత్యేక ఆహ్వానిత దేశంగా హాజరవుతోంది. ఈసారి మోదీ వరుసగా ఏడోసారి జీ7 సదస్సులో పాల్గొనడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, కృత్రిమ మేథస్సు (AI), ఉక్రెయిన్-మధ్యప్రాచ్య ఘర్షణలు వంటి కీలక అంశాలపై భారత్ తన అభిప్రాయాలను వ్యక్తం చేయనుంది.
బిజీగా మోదీ దౌత్య కార్యక్రమాలు
జీ7 సదస్సు సందర్భంగా మోదీ పలు దేశాధినేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో మార్క్ కార్నీ, కెయిర్ స్టార్మర్, షేక్ మహ్మద్ బిన్ జయాద్ ఏ1 నయాన్‌లతో ద్వైపాక్షిక చర్చలు ఉన్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించే అవకాశం ఉంది.
#WATCH | Prime Minister Narendra Modi and US President Donald Trump seen interacting at the G7 Summit in Evian, France.
(Video: DD News) pic.twitter.com/HIiZPZOyxR— ANI (@ANI) June 16, 2026
గ్లోబల్ సౌత్ తరఫున భారత్ గళం
జీ7 ను భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను ప్రపంచానికి తెలియజేసే అవకాశంగా ఉపయోగించుకుంటోంది. గ్లోబల్ సౌత్ దేశాల ఆందోళనలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పులు, సాంకేతిక సహకారం వంటి అంశాలను మోదీ ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందనే సంకేతాన్ని ఈ సదస్సు మరోసారి ఇస్తోంది.

