పొగ త్రాగడంపై నిషేధం విధించిన తొలి దేశం ఏదో తెలుసా? ఎందుకీ నిర్ణయం?
Maldives smoking Ban: పొగ త్రాగడంపై శాశ్వత నిషేధం విధించిన తొలి దేశంగా మాల్దీవులు నిలిచింది. జనవరి 1, 2007 తర్వాత జన్మించిన వారికి పొగ త్రాగడం, కొనుగోలు, విక్రయాలపై నిషేధం విధించింది. ఆ దేశం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?

మాల్దీవుల్లో చారిత్రాత్మక నిర్ణయం
మాల్దీవులు ప్రపంచంలో తొలిసారిగా పొగ త్రాగడంపై జనరేషనల్ బ్యాన్ అమలు చేసిన దేశంగా నిలిచింది. 2025 నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం, జనవరి 1, 2007 తర్వాత జన్మించిన ఎవరికైనా దేశంలో పొగ త్రాగడం, కొనుగోలు చేయడం లేదా విక్రయించడం పూర్తిగా నిషేధం.
ఈ చట్టం టొబాకో కంట్రోల్ చట్టం సెకండ్ అమెండ్‌మెంట్ ద్వారా అమలులోకి వచ్చింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు దీనికి మద్దతు ప్రకటించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని ప్రజారోగ్య రక్షణలో చారిత్రాత్మక మైలురాయిగా పేర్కొంది.
మాల్దీవుల్లో తీసుకువచ్చిన ఈ కొత్త చట్టంలో ఏముంది?
• 2007 జనవరి 1 తర్వాత పుట్టిన ఎవరూ పొగాకు ఉత్పత్తులు కొనుగోలు చేయరాదు, త్రాగరాదు, విక్రయించరాదు.
• ఈ నిషేధం సిగరెట్లు, సిగార్లు, బీడీలు, ఇతర అన్ని పొగాకు ఉత్పత్తులకు వర్తిస్తుంది.
• వ్యాపారులు ప్రతి కొనుగోలుదారుడి వయసు నిర్ధారించాల్సి ఉంటుంది.
• ఉల్లంఘించిన రిటైలర్లకు 50,000 మాల్దీవియన్ రుఫియా (₹2.9 లక్షల) జరిమానా విధిస్తారు.
• ఎలక్ట్రానిక్ సిగరెట్లు లేదా వేపింగ్ పరికరాలను వాడిన వారికి 5,000 రుఫియా (₹29,000) జరిమానా విధిస్తారు.
మాల్దీవులు ఇప్పటికే గత సంవత్సరం వేపింగ్, ఈ-సిగరెట్లను అన్ని వయసుల వారికి నిషేధించింది, ఈ కొత్త చట్టం ఆ ప్రయత్నాన్ని మరింత బలపరుస్తోంది.
పొగ త్రాగడంపై మాల్దీవులు ఎందుకు నిషేధం విధించింది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం 7 మిలియన్లకుపైగా మంది పొగ త్రాగడం వల్ల మరణిస్తున్నారు.
మాల్దీవుల్లో 2024 నాటికి 15–69 ఏళ్ల మధ్య వయస్సు గల జనాభాలో 25.5 శాతం మంది పొగాకు వినియోగదారులు. అందులో పురుషుల శాతం 41.7, మహిళల శాతం 9.3గా ఉంది.
డబ్ల్యూహెచ్ వో "టొబాకో ఎపిడెమిక్"ని ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రజారోగ్య సమస్యగా పేర్కొంది. మాల్దీవులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. మాల్దీవుల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ కొత్త చట్టం భవిష్యత్ తరాలకు పొగాకు రహిత భవిష్యత్తు సృష్టించడం లక్ష్యంగా రూపొందించారు.
ఇతర దేశాలతో పోలిస్తే మాల్దీవుల ప్రత్యేకత ఏమిటి?
న్యూజీలాండ్ 2022లో ఇలాంటి జనరేషనల్ పొగాకు నిషేధ చట్టాన్ని ఆమోదించింది కానీ, 2023లో కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. ఇంగ్లాండ్‌లో కూడా ఇలాంటి బిల్లు ఇంకా పార్లమెంట్‌లో చర్చ దశలో ఉంది. ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలు గ్రాఫిక్ ప్యాకేజింగ్, పబ్లిక్ స్మోకింగ్ నిషేధాలు అమలు చేస్తున్నప్పటికీ, జనరేషనల్ నిషేధం వరకు వెళ్లలేదు.
అందువల్ల, మాల్దీవులు ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా ఈ చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తూ చరిత్ర సృష్టించింది.
టూరిజంపై ప్రభావం లేకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యం
మాల్దీవుల టొబాకో కంట్రోల్ బోర్డు వైస్ చైర్ అహ్మద్ అఫాల్ మాట్లాడుతూ.. “పర్యాటకులు మాల్దీవులకు పొగ త్రాగడానికి కాదు, బీచ్‌లు, సముద్రం, పరిశుభ్రమైన గాలి కోసం వస్తారు” అన్నారు.
2024లో పర్యాటక రద్దీ పెరిగిందని, కొత్త చట్టం కారణంగా ఎటాంటి ప్రభావం రాలేదని అన్నారు. 2025లో 20 లక్షలకు పైగా పర్యాటకులు రావచ్చని అంచనా వేశారు.
పోగాను నిషేధం పై ప్రభుత్వం ఏం చెబుతోంది?
మాల్దీవుల ఫస్ట్ లేడీ సాజిదా మొహమ్మద్ ఈ చట్టాన్ని పొగాకు వ్యసన చక్రాన్ని ఆపే ధైర్యమైన నిర్ణయంగా పేర్కొన్నారు. ప్రెసిడెంట్ ముయిజ్జు మాట్లాడుతూ, “యువత ఆరోగ్యాన్ని కాపాడడం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని అన్నారు. ప్రపంచంలో తొలిసారిగా అమల్లోకి వచ్చిన జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ తో మాల్దీవుల్లో అన్ని రకాల పొగాకు ఉత్పత్తులకు నిషేధం ఉంటుంది.