Donald Trump: ట్రంప్‌కు రూ. 930 కోట్ల విలువైన విమానం బహుమతి.. ఎవరిస్తున్నారంటే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారం మధ్యప్రాచ్య దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఖరీదైన బహుమతి అందనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా బహుమతి.? ఏ దేశం ఇవ్వనుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఖతార్ రాజవంశం తరఫున లగ్జరీ బోయింగ్ 747-8 విమానాన్ని ట్రంప్‌నకు బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. అమెరికా అధికారులు ఈ విమానాన్ని తాత్కాలికంగా ‘ఎయిర్ ఫోర్స్ వన్’గా మలచే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం ట్రంప్ ఈ విమానాన్ని తన పదవీకాలం ముగిసే 2029 జనవరి వరకు ఉపయోగించి, ఆ తరువాత తన ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ఫౌండేషన్‌కి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రయాణంలో ట్రంప్ ఖతార్‌తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలను కూడా సందర్శించనున్నారు. ఖతార్ పర్యటన సందర్భంగా ఈ బహుమతి గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
చట్టపరంగా సమర్థించేందుకు సిద్ధమైన ప్రభుత్వం:
ఒక విదేశీ దేశం నుంచి అద్భుతమైన బహుమతి తీసుకోవడంపై అభ్యంతరాలు వస్తాయని అంచనా వేసిన ట్రంప్ ప్రభుత్వం, ఇది చట్టబద్ధమేనని వివరిస్తూ ఒక లీగల్ విశ్లేషణను సిద్ధం చేసింది. అమెరికా రాజ్యాంగంలోని ఎమోల్యూమెంట్స్ క్లాజ్ ప్రకారం, విదేశీ రాజులు లేదా ప్రభుత్వాల నుంచి బహుమతులు పొందాలంటే కాంగ్రెస్ అనుమతి అవసరం.
భద్రతా మార్పులతో ఎయిర్ ఫోర్స్ వన్‌గా మార్పు:
ట్రంప్ ఈ ఖతార్ విమానాన్ని అధ్యక్షుడిగా ప్రయాణించేందుకు అనుకూలంగా మార్చాలని యోచిస్తున్నారు. దీనికి భద్రతా కమ్యూనికేషన్ వ్యవస్థలు, సీక్రెట్ టెక్నాలజీలు చేర్చనున్నట్లు సమాచారం. అయితే ఇది ప్రస్తుత ‘ఎయిర్ ఫోర్స్ వన్’ వాహనాల స్థాయిలో ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత విమానాల్లో అణు పరిరక్షణ, మిసైల్ నిరోధక టెక్నాలజీ వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి.
Donald Trump
బోయింగ్ విమానాల డెలివరీ ఆలస్యం:
ప్రస్తుతం ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్ (VC-25A) వయసు 30 సంవత్సరాలకు పైగానే ఉంది. కొత్తగా వస్తున్న రెండు VC-25B విమానాల తయారీ ఆలస్యం వల్ల వాటి డెలివరీ 2027, 2028కి వాయిదా పడింది. అందుకే ట్రంప్ ఈ ఖతార్ విమానాన్ని తాత్కాలికంగా ఉపయోగించనున్నారు.
US President Donald Trump (Photo/ US network pool via Reuters)
వ్యాపార లాభాలపై విమర్శలు:
ట్రంప్ కుటుంబం మధ్యప్రాచ్యంలో పెద్ద ఎత్తున వ్యాపారాల్లో చేరింది. ఖతార్‌లో లగ్జరీ గోల్ఫ్ రిసార్ట్ నిర్మాణం కోసం ఖతార్ ప్రభుత్వ సంస్థ Qatari Diarతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇదే సమయంలో ఖతార్‌తో రాజకీయ సంబంధాలు బలపడటం విమర్శలకు దారితీస్తోంది.
అయితే, ట్రంప్ మద్దతుదారులు దీనిపై ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. వ్యాపారాలు ఆయన కుమారుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయనీ, విదేశీ ప్రభుత్వాలతో ప్రత్యక్ష ఒప్పందాల్ని ఆ సంస్థ చేసుకోదని పేర్కొంటున్నారు. కానీ ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలకు మాత్రం అనుమతి ఉందని స్వయంగా తెలిపింది.
వైట్‌హౌస్ స్పందన:
ఇలాంటి విమర్శలపై స్పందించిన వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లెవిట్ మాట్లాడుతూ, “ప్రెసిడెంట్ తనకు లాభం వచ్చేలా ఏదైనా చేస్తున్నారు అని అనుకోవడం అర్థరహితం” అని తేల్చేశారు