VENEZUELA: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..వెనిజులా పరిస్థితి ఇదే
వెనిజులా పరిస్థితి అంగట్లో అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది. సిరిసంపదలతో తులతూగిన వెనిజులా..ఇప్పుడు కుప్పకూలిపోయింది. భూతల స్వర్గం లాంటి వెనిజులా ఎందుకు నరకమైంది.? ప్రకృతి అందాలతో కళకళలాడిన ఆ దేశం..కళావిహీనం కావడానికి కారణాలేంటి?

అమెరికా దాడులతో వణికిపోతున్న వెనిజులా
అగ్రరాజ్యం దాడులతో సంపన్న దేశం వెనిజులా వణికిపోతోంది. ఆ దేశ అధ్యక్షుడు మదురో సతీసమేతంగా అమెరికా బంధీలోకి వెళ్లిపోవడం ఉద్రిక్తతలకు దారి తీసింది. వెనుజులాకు, అమెరికాకు మధ్య కొన్ని నెలలుగా వార్ నడుస్తోంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు వెనిజులా నుంచి వలసలు యూఎస్ లోకి పెరిగిపోతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు.
అయితే తమవద్ద ఉన్న చమురు కోసమే దాడులు చేస్తున్నారని అప్పట్లో మదురో ఖండించారు. అమెరికా చర్యలతో క్యాపిటల్ కారకాస్ ఉలిక్కిపడింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే మదురోను అదుపులోకి తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
భూతల స్వర్గం లాంటి వెనిజులా ఎందుకు నరకమైంది.?
సరే ఇదంతా పక్కన పెడితే..భూతల స్వర్గం లాంటి వెనిజులా ఎందుకు నరకమైంది.? సహజవనరులు, ప్రకృతి అందాలు, పర్వతాలతో కళకళలాడిన ఆ దేశం..కళావిహీనం కావడానికి కారణాలేంటి? ఇక్కడ చూద్దాం.
అందాల దేశం టు అప్పులదేశం
ఎక్కువ మంది ప్రపంచ అందాల భామలు ఉండే దేశమేదైనా ఉంద అంటే అది...వెనిజులానే. ఇక్కడ అందాల పోటీలు అంటే కేవలం వినోదం మాత్రమే కాదు. జాతీయ ఆట లాంటిది. ఖనిజ సంపద, సహజవనరులు, అమెజాన్ అడవులు, ఆండీస్ పర్వతాలు ఇలా ఒక్కటేమిటి స్వర్గాన్ని తలపించేలా ఉండేది. స్థానిక తెగలవాళ్లు దేవుడిగా భావించే టెపుయిస్ పర్వతాలు ఉన్నాయి. బంగారం, ఐరన్, బొగ్గు, నిల్వలు కూడా ఎక్కువగా ఉన్నాయని గతంలో వెనిజులా తెలిపింది. అంతేకాకుండా సహజవనరులు ఉండే దేశాల్లో వెనిజులా పదో స్థానంలో ఉండేది.
వెనిజులాకు ఇది బంగారు బాతు
మరో ముఖ్యమైన విషయం..వెనిజులా దేశంలో 300 బిలియన్ బ్యారెళ్లకుపైగా చమురు ఉండేది. తక్కువ ధరకే లభించేది. ఒక్కమాటలో చెప్పాలంటే ..చమురు నిక్షేపాలు వెనిజులాకు బంగారు బాతు లాంటిది. చమురు వల్లే వెనిజులా ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండేది కాదు. అందుకే ఇక్కడ నీళ్లు కంటే చమురు చవక. ఇక్కడి చమురు నిల్వలతో ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో ఉంది.
పాలకుల చేతకానితనంతో దివాలా
ఆరిపోయిన దీపానికి వెలుగు ఎక్కువనట్లు 2010 ఏడాది వరకూ ఓ వెలుగు వెలిగిన వెనిజులాను...ఒక్కసారిగా పేదరికం ఆవహించింది. ఆర్థిక సంక్షోభం పడగ వేసింది. దేశ పరిస్థితి దివాలా తీసింది. పాలకుల చేతకానితనంతో బోల్తాపడింది. లెక్కలేనంత సంపద ఉన్నా రాజకీయ అనిశ్చితులు వెనిజులాను ఆవహించాయి. ద్రవ్యోల్బణం దెబ్బతింది. చివరకు డబ్బుకు విలువలేకుండా పోయింది. మిషన్ ఉంది కదా కరెన్సీని ముద్రించి పంచిపెట్టేశారు. దీంతో చిన్న వస్తువు కొనాలన్నా సంచుల కొద్దీ డబ్బులు తీసుకెళ్లాల్సి వచ్చింది. చివరకు డబ్బు చిత్తుకాగితమైంది.
మదురో స్వయంకృతాపరాధమే
వెనిజులాలో సంక్షోభం ముందునుంచీ ఉన్నా...మదురో పాలనలో మరీ దిగజారిపోయింది. అందుకు ఆయన స్వయంకృతాపరాధమే. ఒక్కసారిగా నిత్యవరసరాల ధరలు తగ్గించేయడంతో ఉత్పత్తి తగ్గిపోయింది. సప్లై తగ్గి డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఆయన సొంత మనుషులకే పథవులు ఇచ్చి, వేతనాలు పెంచుకుంటూపోయారు. చమురు ఎక్కువగా ఉండటంతో..మిగతా వస్తువుల ఉత్పత్తిపై దృష్టిపెట్టలేదు. చివరకు వీదేశీ మారకం కొరత ఏర్పడింది. వెనిజులాలో దిగుమతి తగ్గింది. అప్పులు ఇచ్చేందుకు ఏ దేశమూ ముందుకు రాలేదు. చివరకు అందాల భామలున్న దేశం కాస్త క్షీణించి అప్పులదేశంగా మారిపోయింది. ఆర్థిక సంక్షోభం పెరగడంతో దేశంలో ఉండలేక ప్రజలు వలస బాట పట్టారు. ఒక్కపూట తిండికి కూడా అల్లాడిపోతున్నారు. దీంతో వెనిజులాలో ఉండలేక పక్కదేశాలకు తరలిపోతున్నారు.

