Fibar Food: ఫైబర్ తింటే ఆరోగ్యమేనా? ఈ సమస్య ఉన్నవాళ్లు అస్సలు తినకూడదు
Fibar Food: ఫైబర్ ఆరోగ్యానికి అవసరమేనని అందరికీ తెలుసు. కానీ జీర్ణవ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అదే ఫైబర్ సమస్యగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని లక్షణాలు కనిపిస్తే ఫైబర్‌పై వెంటనే పునఃపరిశీలన చేసుకోవాాలంటున్నారు.

అన్నిసార్లు ఫైబర్ ఆరోగ్యానికి మంచిది కాదు
ఫైబర్ అంటే ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ అనుకుంటారు. ఆహారం జీర్ణం కావాలంటే ఫైబర్ తప్పనిసరి అన్న భావన కూడా ఉంది. కానీ ప్రతి సందర్భంలో ఫైబర్ మేలు చేస్తుందా అంటే సమధానం మాత్రం లేదనే చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థలో సమస్యలు, పేగుల ఇన్‌ఫ్లమేషన్ ఉన్నవాళ్లకు ఫైబర్ కొన్ని సార్లు సమస్యను తగ్గించడం మానేసి మరింత పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇవన్నీ గట్ సరిగా లేదన్న సంకేతాలే
గట్ అంటే జీర్ణవ్యవస్థ. తినే ఆహారం కడుపు, పేగుల ద్వారా జీర్ణం అవుతుంది. ఈ వ్యవస్థ సజావుగా పనిచేయకపోతే గట్ సమస్యలు మొదలవుతాయి. తిన్న వెంటనే కడుపు ఉబ్బడం, ఎక్కువ గ్యాస్, పొట్ట నొప్పి, మలబద్ధకం..ఇవన్నీ గట్ సరిగా లేదన్న సంకేతాలే.
పేగుల లోపల చిన్న వాపు వస్తే దాన్ని గట్ ఇన్‌ఫ్లమేషన్ అంటారు. ఈ దశలో ఆహార కదలిక నెమ్మదిస్తుంది. అప్పుడు ఫైబర్ లాంటి పదార్థం పేగుల్లోనే ఉండిపోతుంది. అది ఫెర్మెంట్ అయి గ్యాస్ తయారుచేస్తుంది. అందుకే ఫైబర్ తిన్నాక గ్యాస్, మలబద్ధకం పెరుగుతాయి.
ఫైబర్ తగ్గించడం మంచిదంటున్న నిపుణులు
చాలా మంది ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సలాడ్లు, పప్పులు, అధిక ఫైబర్ ఉన్న ఆహారం ఎక్కువగా తింటారు. కానీ గట్ సిద్ధంగా లేని సమయంలో ఇవే ఆహారాలు భారంగా మారతాయి. మంచి ఆహారం తింటున్నామన్న భావనలో మరింత ఎక్కువగా తీసుకుంటే కడుపు ఇంకా ఇబ్బంది పెడుతుంది.
ఇలాంటి సమయంలో కొంతకాలం ఫైబర్ తగ్గించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది శాశ్వతంగా ఫైబర్ మానేయమని కాదు. జీర్ణక్రియ సమస్యలు తగ్గే వరకు ఫైబర్ ఫుడ్ తగ్గించాలి. అప్పుడు పేగులకు రిలీఫ్ దొరుకుతుంది.
ఈ దశలో ఆరోగ్యకరమైన కొవ్వులే మంచిది
ఈ దశలో ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా ఉపయోగపడతాయి. నెయ్యి, మంచి నూనెలు పేగులకు సాఫ్ట్‌గా పనిచేస్తాయి. అలాగే ఉప్పు, నీరు సరిపడా ఉంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చాలామంది బరువు పెరుగుతుందన్న భయంతో ఫ్యాట్స్ తగ్గిస్తారు. కానీ సరైన మోతాదులో ఫ్యాట్స్ గట్‌కు మేలు చేస్తాయి.
కడుపు కాస్త కుదుటపడిన తర్వాత ఫైబర్‌ను మెల్లగా మళ్లీ మొదలుపెట్టాలి. మొదట ఉడికించిన కూరగాయలు, సాఫ్ట్ ఫైబర్‌తో స్టార్ట్ చేయాలి. చివరగా చెప్పాలంటే ఫైబర్ అవసరమే. కానీ జీర్ణక్రియ బాగున్నప్పుడు మాత్రం ఫైబర్ నిజంగా మేలు చేస్తుంది.

