ఇలా తిన్నారో ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త..
చాలా సార్లు మనం ఆరోగ్యానికి మంచిదని భావించే వాటినే తింటుంటాం. కానీ అవి కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. ఎందుకో తెలుసా?

మనలో చాలా మంది ఫిట్ గా, ఆరోగ్యంగా, అందంగా ఉండేందుకు ఎన్నో పనులను చేస్తుంటాం. పనికిరాని వాటిని కూడా నమ్ముతుంటాం. కొన్నిసార్లు ఆరోగ్యానికి మంచిదని భావించే విషయాలు కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన పోషకాహారం కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ప్రయోజనం కంటే హానినే ఎక్కువ కలిగించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పండ్లను ఎక్కువగా తినడం
ఒకేసారి 100 గ్రాముల కంటే ఎక్కువ పండ్లను తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఫాస్ట్ గా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు వ్యాయామం ఎక్కువగా చేయకపోయినా, పగటిపూట
ఎక్కువ చురుగ్గా లేకపోయినా పండ్లను ఎక్కువగా తినకపోవడమే మంచిది. ఇలాంటి వారు పండ్లను ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. నిజానికి మన శరీరానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని మోతాదుకు మించి తినకూడదు.
పాల ఉత్పత్తులను తీసుకోవడం
మొటిమల సమస్యలున్న చాలా మందికి పాల ఉత్పత్తులు అంత మంచివి కావు. ఎందుకంటే ఇవి హార్మోన్లు పెంచుతాయి. అలాగే మంటను కలిగిస్తాయి. ఇది రంధ్రాలను అడ్డుకుంటుంది. అలాగే మొటిమలకు కారణమవుతుంది. పాలను ఇవ్వడానికి ఆవులకు సింథటిక్ హార్మోన్లు, ప్రతిరోధకాలను ఇస్తారు. అలాగే ఈ సింథటిక్ హార్మోన్లు మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఇది మొటిమలు అయ్యేలా చేస్తుంది. అందుకే వీటికి బదులుగా బాదం పాలు, సోయా పాలు లేదా కొబ్బరి పాలు వంటి మొక్కల ఆధారిత పాల ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి.
జీరో ఫ్యాట్ ప్యాక్డ్ ఫుడ్స్
మంచి కొవ్వులను తినడం వల్ల మీ చర్మం మృదువుగా ఉంటుంది. మీ లైంగిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలు కూడా స్థిరంగా ఉంటాయి. అలాగే మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అనేక సున్నా కొవ్వు లేదా తక్కువ కొవ్వు ప్యాకేజ్డ్ ఆహారాలు ఎక్కువగా ప్రాసెస్ చేయబడతాయి. అలాగే వాటి రుచి, ఆకృతిని పెంచడానికి కృత్రిమ రుచులను, రసాయనాలను కలుపుతారు. ఈ పదార్థాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటిలో పోషకాలు కూడా తక్కువగా ఉంటాయి.