హెల్తీ స్నాక్ ఐటమ్స్ నువ్వుల లడ్డు, పెసరపప్పు చిప్స్ ఎలా చెయ్యాలంటే?
జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి స్నాక్స్ కు బదులుగా ఇంటిలోనే హెల్తీగా స్నాక్స్ ఐటమ్స్ తయారు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. కనుక ఇప్పుడు మనం ఇంటిలోనే సులభంగా తయారు చేసుకొనే హెల్దీ స్నాక్స్ నువ్వుల లడ్డు (Nuvvula laddu), పెసరపప్పు చిప్స్ (Pesarapappu chips) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

నువ్వుల లడ్డూలు:
కావలసిన పదార్థాలు: ఒక కప్పు నువ్వులు (Sesame), పావు కప్పు పల్లీలు (Peanuts), పావు కప్పు జీడిపప్పు (Cashew), సగం కప్పు ఓట్స్ (Oats), పావు కప్పు ఎండుకొబ్బరి పొడి (Coconut powder), రెండు కప్పులు బెల్లం (Jaggery) తురుము, సగం స్పూన్ యాలకుల పొడి (Cardamom powder), పావు కప్పు నెయ్యి (Ghee).
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి నువ్వులు, జీడిపప్పు, పల్లీలు, ఓట్స్ వేసి విడివిడిగా వేయించుకొని (Frying) పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ (Grind) చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి.
ఇందులో బెల్లం తురుము, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి మరోసారి బాగా కలుపుకోవాలి (Mix well). ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని మిక్సీ పట్టిన నువ్వుల మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే నువ్వుల లడ్డు రెడీ (Ready).
పెసరపప్పు చిప్స్:
కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఉడికించిన పెసరపప్పు (Pesarappu), రెండున్నర కప్పుల గోధుమపిండి (Wheat flour), ఒకటిన్నర స్పూన్ నువ్వులు (Sesame), ఒక స్పూన్ చాట్ మసాలా (Chat masala), ఒక స్పూన్ కారం (Chili), రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం స్పూన్ ఆమ్చూర్ పొడి (Amchoor powder), చిటికెడు పసుపు (Turmeric), వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ (Oil).
తయారీ విధానం: ఒక గిన్నె తీసుకొని అందులో ఉడికించిన పెసరపప్పు, గోధుమపిండి (Wheat flour), నువ్వులు, చాట్ మసాలా, కారం, ఆమ్చూర్ పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో మూడు టేబుల్ స్పూన్ ల నూనె వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు (Water) పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న పిండిని (Mixed flour) పది నిమిషాల పాటు నాననివ్వాలి. పదినిమిషాల తర్వాత పిండిని చిన్న ఉండలుగా తీసుకుని చపాతీలా మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మందంగా ఒత్తుకుని చపాతీని చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె (Oil) వేసి వేడిచేసుకోవాలి.
నూనె వేడి అయిన తరువాత ఇందులో మందంగా ఒత్తుకుని పెసరపప్పు ముక్కలను వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇదేవిధంగా అన్నింటినీ వేసి ఫ్రై (Fry) చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పు చిప్స్ ను ఒక ప్లేట్ లో తీసుకోవాలి. అంతే పెసరపప్పు చిప్స్ రెడీ (Ready).