మీల్ మేకర్ కుర్మా.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
మీల్ మేకర్స్ లో పోషకాలు (Nutrients) మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ చాలా మంది వీటిని తినడానికి పెద్దగా ఇష్టపడరు.

వీటితో కుర్మాను ట్రై చేస్తే తిననివారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీని తయారీ విధానం సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం మీల్ మేకర్ కుర్మా (Meal Makers Kurma) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: 50 గ్రాముల మీల్ మేకర్స్ (Meal Makers), రెండు పెద్ద ఉల్లిపాయలు (Onions), ఒక కప్పు టమోటా పేస్ట్ (Tomato paste), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), రెండు టేబుల్ స్పూన్ ల కాజు (Kaju), పావు కప్పు పెరుగు (Yogurt), ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste).
ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder), సగం స్పూన్ గరం మసాల (Garam masala), ఒక టేబుల్ స్పూన్ కారం (Chili powder), సగం స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), రుచికి సరిపడా ఉప్పు (Salt), మూడు టేబుల్ స్పూన్ ల చింతపండు పులుసు (Tamarind soup), కొత్తిమీర (Coriander) తరుగు, సగం కప్పు నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నూనె పోసి వేడెక్కిన తరువాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు వేసి బాగా ఎర్రగా మంచి కలర్ వచ్చే వరకూ ఫ్రై (Fry) చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాజు, పెరుగు, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి.
ఇప్పుడు సుమారు గంట పాటు వేడి నీటిలో నానబెట్టుకున్న (Soaked) మీల్ మేకర్స్ ను తీసుకొని బాగా గట్టిగా పిండి నీళ్లన్నీ పిండుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి గట్టిగా పిండుకున్న మీల్ మేకర్స్ ను వేసి పచ్చివాసన (Raw smell) పోయే వరకు ట్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా అదే కడాయిలో నూనె వేసి వేడెక్కిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాల, కొన్ని నీళ్లు పోసి పచ్చివాసన పోయేంత వరకు మసాలాలన్నీ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో టమోటా పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి (Mix well). టమోటా పేస్ట్ బాగా మగ్గిన తరువాత గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయకాజు మసాలాని వేసి తక్కువ మంట (Low flame) మీద ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పిండి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న మీల్ మేకర్స్, సగం కప్పు నీళ్లు పోసి తక్కువ మంట మీద కూర నుండి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని చివరిలో కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) మీల్ మేకర్ కుర్మా రెడీ (Ready).