- Home
- Life
- Health
- ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా ముప్పు.. కొత్త వేరియంట్ ఎరిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే?
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా ముప్పు.. కొత్త వేరియంట్ ఎరిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే?
బ్రిటన్ సహా ప్రపంచంలోని దాదాపు 45 దేశాల్లో ఈఆర్ఐఎస్ (ERIS) పేరుతో కొత్త వేరియంట్ నిర్ధారణ అయింది. భారతదేశ ప్రజలు కూడా ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇది ప్రపంచం మొత్తాన్ని తనగుప్పిట్లోకి తీసుకున్నది. ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. మరెంతో మందిని అనాథలను చేసింది. దిక్కులేని వాళ్లను చేసింది. రోడ్డున పడేసింది. ఈ కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇప్పుడిప్పుడే ఈ కోవిడ్ నుంచి ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి. కానీ ఈ వైరస్ మరో కొత్త రూపంలో ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో ఈజీ.5 పేరుతో కొత్త రకం కోవిడ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనిని అనధికారికంగా ఎరిస్ అని కూడా పిలుస్తున్నారు. యూఎస్, యూకే, చైనాలో ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల దీనిని 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా వర్గీకరించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనాల ప్రకారం.. యూఎస్ లోని అనేక ప్రాంతాలు వైరస్ మొదటి పెరుగుదలను నివేదించాయి. గత వారం.. మొత్తం కోవిడ్ కేసులలో 17.3 శాతం కొత్త వేరియంట్ వే ఉన్నాయి.
ఈజీ.5 వేరియంట్ అంటే ఏంటి?
దీనిని ఎరిస్ అని కూడా పిలుస్తారు. ఈజీ. 5 అనేది ఓమ్రికాన్ XBB సబ్ వేరియంట్. ఇది కూడా కోవిడ్ వేరియంట్, సబ్ వేరియంట్ మాదిరిగానే తలనొప్పి, ముక్కు కారడం, అలసట, గొంతు నొప్పి వంటి ఒమ్రికాన్ లక్షణాలను కలిగిస్తుంది. ఇది కోవిడ్ తాజా వేరియంట్ వ్యాప్తి XBB.1.16 వేరియంట్ కంటే 45 శాతం ఎక్కువ.
ప్రపంచంలో అత్యధిక ప్రభావిత ప్రాంతాలు ఏవంటే?
గత వారం యూస్ లో నమోదైన మొత్తం కోవిడ్ 19 కేసులలో 17 శాతానికి పైగా EG.5 కేసులే ఉన్నాయి. ఇది దేశంలో అత్యంత సాధారణ రూపాంతరంగా మారింది. ఒక్క యూఎస్‌లోనే కాకుండా యునైటెడ్ కింగ్‌డమ్‌లో కూడా ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. జూలై 20 నాటికి ఈ వేరియంట్ 14 శాతానికి పైగా కోవిడ్ కేసులకు కారణమైంది.
దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే?
పలు మీడియా నివేదికల ప్రకారం.. కొత్త వేరియంట్ మునుపటి స్ట్రెయిన్లకు భిన్నంగా ఏం లేదు. దీనివల్ల జ్వరం, తలనొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, అలసట, దగ్గు, ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.
ఈజీ.5 వేరియంట్ గురించి భారత ప్రజలు అప్రమత్తంగా ఉండాలా?
ఈ వేరియంట్‌కు సంబంధించిన మొదటి కేసు మహారాష్ట్రలో నమోదైంది. రాష్ట్రంలో కోవిడ్ కేసుల యాక్టివ్ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. జులై చివరి వారంలో 70 మంది ఉండగా.. ఆగస్టు 6 నాటికి ఈ సంఖ్య 115కి చేరుకుంది. అయితే హాస్పటలో లో చేరడం, మరణాలు పెరగడం లేదని వైద్యులు గమనించారు. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. అయితే అప్రమత్తంగా మాత్రం ఉండాలని నిపుణులు చెబుతున్నారు.