ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ తో వేసవి సమస్యలకు చెక్.. ఎలా చెయ్యాలంటే?
ఎండలు పెరిగిపోవడంతో శరీరం నీరసించి అనేక అనారోగ్య సమస్యలను (Illness issues) ఎదుర్కొంటోంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి చాలామంది అనుసరిస్తున్న సరికొత్త ఆరోగ్య పద్ధతి ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ (Infused water).

ఈ వాటర్ ను తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభించి రోజంతా హుషారుగా ఉండేందుకు సహాయ పడుతుంది. అలాగే ఎండకాలంలో ఎదుర్కొనే అనేక సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మరి ఈ నీళ్ల గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వేసవికాలంలో శరీరానికి నీళ్లు, ఇతర ద్రవపదార్థాలను ఎక్కువగా అందించడం మంచిది. అయితే మనం ఆరోగ్యం (Health) కోసం పండ్లు, పండ్ల రసాలు తాగడం తరచూ చేస్తుంటాం. కానీ వాటిని నీళ్లలో నానబెట్టి (Soaked in water) తాగితే శరీరానికి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు అంటున్నారు. ఇలా పండ్లను నానబెట్టిన నీటినే ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ అని అంటారు.
ఈ నీటిని ఫ్లేవర్డ్ వాటర్ (Flavored water), డిటాక్స్ వాటర్ (Detox water), స్పా వాటర్ అని ఇలా పలురకాలుగా పిలుస్తుంటారు. అయితే ఈ ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ బయట మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నాయి. కానీ ఇవి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి కనుక వీటిని ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. ఈ వాటర్ వగరూ, తీపి, పులుపు రుచులతో ఉంటాయి. పైగా ఈ వాటర్ లో చక్కెరలు తక్కువ స్థాయిలో ఉంటాయి.
ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ తయారీ విధానం..
ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ తయారీ (Preparation) కోసం మీకు నచ్చిన మూడు నాలుగు రకాల పండ్లను (Fruits) తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని ఒక గాజుసీసాలో వేయాలి. తరువాత ఇందులో పుదీనా, తులసి, రోజ్ మేరీ, గులాబీ రేకులను వేసి చల్ల నీళ్లు పోసి ఐదు గంటల పాటు అలాగే ఉంచి తరువాత ఆ నీటిని తాగొచ్చు. వేడి నీళ్లు అయితే మూడు గంటల పాటు ఉంచితే చాలు.
ఉపయోగాలు..
వీటిలో ఉప్పు, చక్కెరలు, ఇతర శీతల పానీయాలను అసలు కలపకూడదు. ఇలా సహజసిద్ధమైన పద్ధతిలో చేసుకునే ఈ వాటర్ ను ఎవరైనా తాగొచ్చు. ఈ వాటర్ తయారీలో ఉపయోగించే పండ్ల ముక్కలలోని విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), ఫైటో న్యూట్రియంట్స్ (Phytonutrients) ఈ నీళ్లలోకి చేరి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ముఖ్యంగా ఈ నీటిని వేసవికాలంలో తీసుకుంటే డీహైడ్రేషన్ (Dehydration), అతిదాహం, వడదెబ్బ (Sunstroke) వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలాగే శారీరక శ్రమ కారణంగా నీరసించిన శరీరానికి తక్షణ శక్తిని అందించడం కోసం ఈ ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ సహాయపడతాయి. ఈ వాటర్ ను తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి మెటబాలిజం పనితీరు వేగవంతమవుతుంది.
అలాగే శరీరంలోని కెలొరీలను వేగంగా కరిగేలా చేస్తాయి. అంతే కాకుండా ఈ వాటర్ లో ఉండే పోషకాలు (Nutrients) జీర్ణవ్యవస్థను (Digestive system) శుభ్రం చేసి దాని పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే శరీరంలోని పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. కనుక వేసవికాలంలో ఈ వాటర్ ని తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..