ఈ ఐదు నియమాలు పాటిస్తే గుండె ఆరోగ్యం మీ సొంతం.. అవేంటంటే?
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు గుండె ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఏ ఇతర అవయవాలు పనిచేయకపోయినా కొంతకాలం అయినా జీవించవచ్చు.

గుండె ఆరోగ్యం (Heart health) దెబ్బతింటే మాత్రం జీవితమే పోతుంది. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. అందుకని గుండెను పదిలంగా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొన్ని ఆరోగ్య నియమాలను (Health regulations) పాటిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తగినంత బరువు ఉండాలి: ఉండవలసిన బరువు కంటే అధిక బరువు (Over weight ) ఉన్నప్పుడు దాని ప్రభావం గుండెపై పడి ఉండే గుండె జబ్బులకు దారితీస్తుంది. కనుక ఎత్తుకు తగినట్టు బరువు ఉండాలి అప్పుడే శరీరానికంతా రక్తప్రసరణ (Blood circulation) సాఫీగా జరుగుతుంది. అధిక బరువు ఉన్నప్పుడు శరీరానికంతా రక్తసరఫరా సాఫీగా జరిగేందుకు గుండె అధికంగా శ్రమించి అధిక ఒత్తిడికి గురవుతుంది. దీంతో గుండె జీవిత కాలం తగ్గుతుంది. కనుక ఆహారపు నియమాలను పాటిస్తూ అధిక బరువును తగ్గించుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ పదార్థాలకు దూరంగా ఉండండి: తెల్లని పదార్థాలు, తెల్లని రవ్వ, తెల్లని బియ్యం, మైదా, పంచదార, బేకరీ పదార్థాలు, కేకులు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వంటి పదార్థాలను తీసుకుంటే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇటువంటి పదార్థాలను తీసుకుంటే రక్తంలో కొవ్వు శాతం (Fat percentage) పెరుగుతుంది. దీంతో రక్తం చిక్కగా మారి రక్తనాళాలలో (Blood vessels) అడ్డంకులు ఏర్పడతాయి. కనుక ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అరవరుచుకోండి.. మీ గుండె జీవిత కాలాన్ని పెంచుకోండి..
ఉప్పు, నూనె, నెయ్యి: మనం తినే ఉప్పు గుండె కణజాలలో, గుండె కండరాలలో పేరుకుపోయి గుండె కండరాలను (Heart muscles) బిగిసుకుపోయేలా చేసి రక్త సరఫరా సాఫీగా జరగకుండా అడ్డుకుంటుంది. దీంతో రక్త కణాలు సాగే గుణాన్ని కోల్పోయి గట్టిపడడం, బిపి వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. అలాగే నూనె, నెయ్యిల వాడకంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol) పెరిగి గుండె జబ్బులకు దారితీస్తుంది. కనుక గుండె సమస్యలతో బాధపడేవారు ఈ మూడు పదార్థాలకు దూరంగా ఉండాలి.
వ్యాయామం: ప్రస్తుతం ఉన్న ఉరుకు పరుకుల జీవితంలో అందరూ వ్యాయామానికి (Exercise) సమయాన్ని కేటాయించడం లేదు. అలాగే సరైన సమయానికి భోజనం చేయకపోవడం, భోజనం చేసిన వెంటనే పడుకోవడం చేస్తున్నారు. ఇలా చేస్తే శరీరానికి శారీరక శ్రమ (Physical activity) తగ్గి దాని ప్రభావం గుండెపై పడుతుంది. కనుక భోజనం చేశాక అరగంట పాటు వాకింగ్ చేయాలి. ఎంత ఎక్కువసేపు వాకింగ్ చేసి అంత బాగా శరీరానికి రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం బాగుంటుంది.
మానసిక ఒత్తిడి: మానసిక ఒత్తిడి (Mental stress) కూడా గుండె సమస్యలకు ప్రధాన కారణం. మానసిక ఒత్తిడి కారణంగా ప్రతి ఏటా గుండె సమస్యలతో మరణించే వారి సంఖ్య పెరుగుతుంది. మన శరీరం ఒత్తిడికి గురి అయినప్పుడు గుండె ఎక్కువగా స్పందిస్తుంది. దీంతో గుండె పనితీరు (Heart function) పెరుగుతుంది. ఫలితంగా అది గుండె సమస్యలకు దారితీసి గుండె జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. కనుక శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకొని ఒత్తిడిని తగ్గించుకోండి.