Liver Cancer: శరీరంలో ఈ భాగంలో నొప్పి ఉందా.? లివర్ క్యాన్సర్ కావొచ్చు
Liver Cancer: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. లివర్ క్యాన్సర్ కేసులు ఇటీవల ఎక్కువుతున్నాయి. కొన్ని లక్షణాల ద్వారా ఈ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు.

లివర్ క్యాన్సర్ లక్షణాలు
మన శరీరంలో చిన్నచిన్న నొప్పులు, అలసట, కడుపు భారంగా అనిపించడం వంటి సమస్యలను చాలామంది సాధారణంగా తీసుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం, ఇవి కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధులకు సూచన కావచ్చు. ముఖ్యంగా కడుపులో కుడి వైపు నిరంతర నొప్పి ఉంటే, అది కాలేయ క్యాన్సర్ హెచ్చరిక కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఏ భాగంలో నొప్పి వస్తే జాగ్రత్తపడాలి?
కాలేయ క్యాన్సర్ ప్రారంభ దశలో రోగి కడుపు కుడి ఎగువ భాగంలో నొప్పి ఉంటుంది. ఈ నొప్పి ఎప్పటికప్పుడు ఉండవచ్చు లేదా మధ్యమధ్యలో ఎక్కువవుతుంది. కొన్నిసార్లు ఈ నొప్పి వీపు లేదా భుజం వరకు వ్యాపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఎక్కువ రోజులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
లివర్ క్యాన్సర్ ప్రధాన లక్షణాలు
నొప్పితో పాటు, కొన్ని ఇతర లక్షణాలు కూడా కాలేయ క్యాన్సర్‌ను సూచిస్తాయి. వీటిలో ప్రధానమైవని.. ఎప్పుడూ అలసటగా అనిపించడం, కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, దీర్ఘకాలంగా కామెర్లు (చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం) ఉండడం, కడుపు ఉబ్బరం లేదా భారంగా అనిపించడం, తరచుగా వికారం లేదా వాంతులు ఉండడం వంటివి లక్షణాలుగా చెప్పొచ్చు.
ప్రమాదాన్ని పెంచే కారణాలు
కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచే ముఖ్య కారణాలు. ఎక్కువకాలం మద్యం సేవించడం, హెపటైటిస్ బి, సి వైరస్ ఇన్ఫెక్షన్, ఫ్యాటీ లివర్ సమస్య, ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ధూమపానం, చెడు జీవనశైలి వంటివి కారణాలుగా చెబుతున్నారు.
కాలేయ క్యాన్సర్ నివారణకు చిట్కాలు
సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే కాలేయ క్యాన్సర్‌ను నిరోధించవచ్చు. ముఖ్యంగా..
* మద్యం, ధూమపానంకు దూరంగా ఉండండి.
* సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి
* క్రమం తప్పకుండా లివర్ టెస్టులు చేయించుకోండి
* హెపటైటిస్ బి టీకాలు వేయించుకోండి
* బరువును నియంత్రించుకొని, వ్యాయామాన్ని దినచర్యలో చేర్చుకోండి.