కాజు పనీర్ బర్ఫీ, మైదా మేథీ బిస్కెట్స్.. ఇలా చేస్తే ఎంత రుచిగా ఉంటాయో తెలుసా?
పిల్లలు బిస్కెట్లు (Biscuits), స్వీట్లు (Sweets) తినడానికి చాలా ఇష్టపడతారు. వీటిని బయట నుంచి తెచ్చుకునే బదులుగా ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వీటి తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కాజు పనీర్ బర్ఫీ..
కావలసిన పదార్థాలు: ఒక కప్పు జీడిపప్పు (Cashew), ఒక కప్పు పాలు (Milk), ఒకటింపావు కప్పు పనీర్ (Paneer), పావు కప్పు నెయ్యి (Ghee), పావు కప్పు పంచదార (Sugar), కొంచెం యాలకుల పొడి (Cardamom powder), కొన్ని పిస్తా (Pista) పలుకులు.
తయారీ విధానం: ముందుగా జీడిపప్పును రెండు గంటలపాటు పాలలో నానబెట్టుకోవాలి (Soak in milk). ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పనీర్, పంచదార, పాలు, నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.
నెయ్యి కరిగిన తరువాత అందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పనీర్ మిశ్రమాన్ని వేసి ఉడికించుకోవాలి. మధ్యమధ్యలో కలుపుతూ తక్కువ మంట (Low flame) మీద ఉడికించుకోవాలి. కాసేపటికి మిశ్రమమంతా దగ్గరకు వచ్చాక యాలకులపొడి, పిస్తా పలుకులు వేసి బాగా కలుపుకుని (Mix well) స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో పరచుకోవాలి. మిశ్రమమంతా చల్లారాకా మీకు ఇష్టమైన ఆకారంలో (Shaped) కట్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కాజు పనీర్ బర్ఫీ (Cashew Paneer Barfi) రెడీ. ఈ స్వీట్ వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.
మైదా మేథీ బిస్కెట్లు..
కావలసిన పదార్థాలు: ఒక కప్పు మైదా (Maida), పావు కప్పు బొంబాయిరవ్వ (Ravva), ఒక స్పూన్ కసూరీ మేథీ (Kasuri Mathi), సగం స్పూన్ వాము (Vamu), సగం స్పూన్ మిరియాలపొడి (Pepper powder), చిటికెడు ఉప్పు (Salt), మూడు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee), వేయించేందుకు సరిపడా నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మైదా, బొంబాయి రవ్వ, కసూరీ మేథీ, వాము, మిరియాల పొడి, నెయ్యి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు (Water) పోసి చపాతీ పిండిలా కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తరువాత కొద్దిగా పిండిని తీసుకొని మందంగా (Thick) చిన్న పూరీల్లా వత్తుకోవాలి.
ఇప్పుడు ఫోర్కుతో అక్కడక్కడ గాట్లు పెట్టుకోవాలి. ఇలా మిగిలిన మొత్తం మిశ్రమాన్ని చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె (Oil) బాగా కాగుతున్నప్పుడు చేసుకున్న పూరీలను వేసి ఎర్రగా వేయించుకుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మైదా మేథీ బిస్కెట్లు (Maida Mathi Biscuits) రెడీ.