ఉదయాన్నే పరిగడుపున నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా?
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగాలని పెద్దలు చెప్పడం వినే ఉంటారు. ఇలా ఎందుకు చేయాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఉదయాన్నే పరిగడుపున నీళ్లను తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే వావ్ అంటారు.
ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లను తాగే అలవాటు కొంతమందికి మాత్రమే ఉంటుంది. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా మంచిది అన్న ముచ్చట ఎవ్వరికీ తెలియదు. చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే టీ లేదా కాఫీని తాగుతుంటారు. కానీ వీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇవి బాడీ డీహైట్రేట్ అయ్యేలా చేయడంతో పాటుగా మరెన్నో సమస్యలకు కారణమవుతాయి. అసలు పరిగడుపున నీళ్లను ఎందుకు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బరువు తగ్గడానికి..
ఉదయం నిద్రలేవగానే తేలికపాటి గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా బరువు కూడా తాగుతారని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే కొవ్వు త్వరగా కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకుంటే మీరు ఉదయం లేవగానే టీ లేదా కాఫీని తాగడానికి బదులుగా గోరువెచ్చని నీటిని తాగండి.
జీర్ణక్రియ
ఉదయాన్నే పరగడుపున నీళ్లను తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ వాటర్ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. మీకు తరచుగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తే ఉదయాన్నే నీళ్లను తాగితే ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
చర్మానికి మేలు
ఉదయాన్నే నిద్రలేచి పరిగడుపున నీళ్లను తాగడం వల్ల శరీరం మాత్రమే కాదు, చర్మం కూడా హైడ్రేట్ గా ఉంటుంది. ఇది చర్మం అందంగా మెరిసేలా చేస్తుంది. నీళ్లు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తాయి. దీంతో మీకు మొటిమలు, మచ్చల సమస్యలు తొలగిపోతాయి.
మలబద్ధకం
ఉదయాన్నే పరగడుపున నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడటమే కాకుండా మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. నీళ్లను తాగడం వల్ల మలం మృదువుగా మారి శరీరంలోని వ్యర్థాలు త్వరగా బయటకు వస్తాయి.