నోరూరించే కరకరలాడే మసాలా కుర్ కురే.. ఇంట్లోనే ఇలా తయారు చెయ్యండి!
ఇంట్లో ఎప్పుడూ చేసుకునే చెకోడీలు, జంతికలు, బూందీ వంటి రొటీన్ పదార్థాలను తినడానికి చిన్నారులు ఇష్టపడరు. అందుకే ఈసారి రొటీన్ (Routine) గా చేసుకునే పదార్థాలకు బదులుగా మసాలా కుర్ కురే (Masala kurkure) లను ట్రై చేయండి.

బయట మార్కెట్ లో నుంచి తెచ్చుకునే బదులుగా ఇంట్లోనే కుర్ కురే రెడీ చేసి చూడండి. ఇవి చిన్నారులకు బాగా నచ్చుతాయి. అంతేకాదు బయట మార్కెట్ లో కురుకురులు వేడి చేసిన నూనెనే మళ్ళీ మళ్ళీ వేడి చెయ్యడం వల్ల వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే ఇంట్లోనే తయారు చేసుకోవడం అన్ని విధాలుగా మంచిది. ఇంకెందుకు ఆలస్యం వీటి తయారీ విధానం గురించి ఇప్పుడే తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యప్పిండి (Rice flour), పావు కప్పు సెనగపిండి (Besan), రెండు టేబుల్ స్పూన్ ల గోధుమపిండి (Wheat flour), ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి (Corn flour), సగం స్పూన్ ఉప్పు (Salt), పావు స్పూన్ వంటసోడా (Baking soda), ఒక స్పూన్ వెన్న (Butter), రెండు కప్పుల నీళ్లు (Water), ఢీ ఫ్రైకి సరిపడా నూనె (Oil).
మసాలా కోసం కావలసిన పదార్థాలు: సగం స్పూన్ గరంమసాలా (Garam masala), సగం స్పూన్ కారం (Chili), సగం స్పూన్ చాట్ మసాలా (Chat masala), ఒక స్పూన్ పంచదార (Sugar), పావు స్పూన్ ఉప్పు (Salt).
తయారీ విధానం: ముందుగా మసాలా కోసం (For spice) ఒక గిన్నె తీసుకుని అందులో కారం, గరంమసాలా, ఉప్పు, పంచదార, చాట్ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి, గోధుమపిండి, వంటసోడా, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి (Mix well). తరువాత ఇందులో నీళ్లు పోసి మరొకసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో కలుపుకున్న బియ్యప్పిండి మిశ్రమాన్ని వేయాలి. తక్కువ మంట (Low flame) మీద మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం దగ్గరకు అవుతుంది. ఇలా మిశ్రమం దగ్గరకు పడ్డాక అందులో వెన్న (Butter) వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఐదు నిమిషాల తర్వాత అందులో మొక్కజొన్న పిండి వేసి మరొకసారి బాగా కలపాలి. మిశ్రమం చల్లారాక చేతులకు నూనె రాసుకుని కొద్దిగా పిండిని తీసుకొని సన్నగా, పొడవుగా కుర్ కురే ఆకారంలో (Shaped) చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడా నూనె (Oil) వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో చేసుకున్న కుర్ కురేలను వేసి ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి.
ఇవి వేడిగా ఉన్నప్పుడే వీటిపైన ముందుగా చేసుకున్న మసాలా పొడిని చల్లుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే కరకరలాడే మసాలా కుర్ కురేలు రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కారం కారంగా కరకరలాడుతూ (Crispy) కమ్మగా ఉండే ఈ మసాలా కుర్ కురేలను తినడానికి చిన్నారులు బాగా ఇష్టపడతారు.