మందు మానేస్తే ఏమౌతుందో తెలుసా?
Health Tips: ఆల్కహాల్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదన్న ముచ్చటను ఎన్నో అధ్యయనాలు కూడా వెల్లడించాయి. అయినా దీన్నిరెగ్యులర్ గా తాగేవారున్నారు. నిజానికి ఇది ఒక్క కాలెయాన్నే కాదు మొత్తం శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఒకవేళ మీరు మందును తాగడం మానేస్తే ఏమౌతుందో తెలుసా?
ఆల్కహాల్ ఆరోగ్యానికి ఎలా దెబ్బతీస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ తెలిసి కూడా దీన్ని రెగ్యులర్ గా తాగేవారున్నారు. ఎందుకంటే ఈ అలవాటు వ్యసనంలా మారిపోతుంది. అందుకే ఈ అలవాటును మానాలని ప్రయత్నించి ఫెయిల్ అయిన వారు చాలా మందే ఉన్నారు. ఎప్పుడో ఒకసారి మందును తాగడం వల్ల ఆరోగ్యానికి పెద్దగా నష్టమేమీ జరగకపోవచ్చు. కానీ రెగ్యులర్ గా తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది ప్రాణాల మీదికి తెస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మందును తాగడం వల్ల కాలేయం మాత్రమే దెబ్బతింటుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆల్కహాల్ వినియోగం ప్రత్యక్షంగా, పరోక్షంగా కాలేయం, గుండె, మెదడుతో సహా అన్ని అంతర్గత అవయవాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ అలవాటును మానేయడమే మంచిది. అయితే మందును మానేస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బరువు తగ్గడం
మందు మానేయడం వల్ల మీరు బరువు తగ్గుతారు. అయితే మీరు మంచి మార్గంలోనే బరువు తగ్గుతారు. దీనికి బయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఆల్కహాల్ ఉన్న పానీయాల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే వీటిని తాగడం వల్ల మీరు బరువు పెరుగుతారు. రెగ్యులర్ గా తాగేవారికి పొట్ట ఉంటుంది మీరు గమనించారో లేదో..
మెరుగైన నిద్ర
మందు తాగితే బాగా నిద్రపడుతుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ దీనిలో ఇంత కూడా నిజం లేదు. మీరు తాగినప్పుడు మీకు సరిగ్గా నిద్ర రాదు. కేవలం ఒక గంట మాత్రమే మీరు బాగా పడుకుంటారు. ఆ తర్వాత సరిగ్గా నిద్ర పట్టదు. ఇది చివరికి మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ మందును మానేసినప్పుడు మీరు కంటినిండా నిద్రపోతారు. దీంతో మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
మెదడు పనితీరు
మందును మానేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రెగ్యులర్ గా తాగేవారు జ్ఞాపకశక్తిని కోల్పోతారు. అలాగే ఏకాగ్రత కూడా లోపిస్తుంది. మందును మానేయడం ద్వారా ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. అలాగే డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
చర్మ ఆరోగ్యం
ఆల్కహాల్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. అందుకే తాగడం మానేసినప్పుడు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆల్కహాల్ కాలేయంతో సమస్యలను కలిగిస్తుంది, ఇది ప్రధానంగా చర్మాన్ని ప్రభావితం చేస్తుంది.
alcohol
కాలేయం ఆరోగ్యం
మందు తాగడం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవయవాలలో కాలెయం ఒకటి. మీరు దీన్ని మానేసినప్పుడు కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. సురక్షితంగా ఉంటుంది. ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ సిరోసిస్, కాలేయ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి. మందును మానేయడం వల్ల ఈ సమస్యలన్నీ దూరమవుతాయి.