రోజుకు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే ఇన్ని రోగాలు తగ్గిపోతాయా?
వెల్లుల్లి ఆహారాలను టేస్టీగా చేయడమే కాదు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. రోజుకు రెండు లేదా మూడు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే ఎన్నో రోగాలు తగ్గిపోతాయంటున్నారు నిపుణులు.

అల్లం, వెల్లుల్లిని ప్రతి కూరలో ఉపయోగిస్తారు. అల్లం సంగతి పక్కన పెడితే వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. వెల్లుల్లిలో ఉండే 'అల్లిసిన్' అనే పదార్థం మనల్ని ఎన్నో రోగాల ముప్పు నుంచి రక్షిస్తుంది. వెల్లుల్లిలో ఫాస్పరస్, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ కె, నియాసిన్, ఫోలేట్, థియామిన్ లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది అధిక రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ఎన్నో వ్యాధులకు ప్రధాన ప్రమాద కారకాలలో ఒకటి. అధిక రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటును గణనీయంగా తగ్గించడానినకి వెల్లుల్లి సప్లిమెంట్స్ సహాయపడతాయి.
garlic
వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల పేగుల్లోని పురుగులు చనిపోతాయి. అలాగే కడుపులోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను ఇది రక్షిస్తుంది. అంతేకాదు హానికరమైన బ్యాక్టీరియాను పోగొట్టడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. వెల్లుల్లి తినడం మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లోని సమ్మేళనాలు కొవ్వును తగ్గించే ప్రక్రియను ప్రేరేపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
రోజుకు రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల దగ్గు, జలుబు తొందరగా తగ్గిపోతాయి.ఈ వెల్లుల్లిని రోజూ ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
వెల్లుల్లిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలపై ఇటీవలి శాస్త్రీయ పరిశోధన.. వెల్లుల్లి వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాల నిరోధకతను కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉందని తేలింది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించి ముఖాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి.
వెల్లుల్లిని తినడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. దీనిలోని బయోయాక్టివ్ అణువులు క్యాన్సర్ కణాల విస్తరణను నాశనం చేస్తాయని లేదా నియంత్రించగలవని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
వెల్లుల్లి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. వెల్లుల్లిలో 20 కంటే ఎక్కువ పాలీఫెనోలిక్ భాగాలు ఉన్నాయని నిరూపించబడింది. ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలలో వెల్లుల్లి ఒకటి.
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మనల్ని రక్షిస్తాయి. వెల్లుల్లి క్యాన్సర్, డయాబెటిస్, అల్జీమర్స్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఒత్తిడి, మంట వల్ల కలిగే ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.