బ్లడ్ షుగర్ నుంచి జీర్ణ సమస్యల వరకు.. మెంతులతో ఈ సమస్యలన్నీ తగ్గిపోతయ్
మెంతుల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో సమ్మేళనాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న గింజలు మన బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయడం నుంచి జుట్టును పెంచడం వరకు ఎంతో మేలు చేస్తాయి.

Image: Getty Images
మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారమే కీలక పాత్ర పోషిస్తుంది. చెడు ఆహారాలను తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. మన ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాల్లో మెంతులు కూడా ఉన్నాయి. ఈ చిన్నచిన్న గింజలు ఏం చేస్తాయిలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇవి మనల్నిఎన్నో రోగాల ముప్పు నుంచి రక్షిస్తాయి. వీటిని తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది మెంతులను వంటల్లో కూడా వేస్తుంటారు. ఇవి కాస్త చేదుగా ఉన్నా.. వంటలను టేస్టీగా చేస్తాయి. అంతకు మించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మీకు తెలుసా? ఇవి మన జుట్టుకు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని ఉపయోగించి చుండ్రు, బట్టతల, జుట్టు రాలడం, నెత్తిమీద సమస్యలను ఇట్టే తగ్గించుకోవచ్చు. మెంతుల్లో ఈ సమస్యలను తగ్గించడానికి సహాయపడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు మలబద్ధకం, జలుబు, గొంతునొప్పి వంటి వివిధ వ్యాధులను దూరం చేయడానికి కూడా మెంతులు సహాయపడతాయి.
శరీరంలో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గించడంలో మెంతులు ప్రభావవంతంగా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మిచిగాన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మెంతుల్లో ఉండే స్టెరాయిడ్ సాపోనిన్లు గట్ లోని కొలెస్ట్రాల్ శోషణను నెమ్మదింపజేస్తాయి. ఇది కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి రేటును కూడా తగ్గిస్తుంది.
మధుమేహాన్ని ఎదుర్కోవటానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మెంతులు ఎంతో సహాయపడతాయి. ఇది 4HO-Ile అని పిలువబడే అసాధారణ అమైనో ఆమ్లాన్ని కూడా కలిగి ఉంటుంది. 4HO-Ile కొన్ని యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది. అలాగే ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా పెంచుతుంది. డయాబెటిస్ చికిత్సలో మెంతులను ఉపయోగించవచ్చని క్వామ్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు సూచిస్తున్నారు. మెంతి వాటర్ ను తాగడం వల్ల పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.
మెంతుల్లో జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మెంతులను ఆహారంలో చేర్చుకున్నా, జుట్టుకు అప్లై చేసినా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చుండ్రును తగ్గిస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. ఇది కొవ్వు ఆహారాల నుండి ట్రైగ్లిజరైడ్స్ శోషణను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.