పైనాపిల్ జ్యూస్ ను ఇలా ఉపయోగిస్తే అందమైన, కాంతివంతమైన చర్మ సౌందర్యం మీ సొంతం!
పైనాపిల్ (Pineapple) రుచికి పుల్లగా, తియ్యగా ఉంటుంది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. అయితే మెరుగైన చర్మ సౌందర్యం (Skin beauty) కోసం పైనాపిల్ ను ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పైనాపిల్ ను అనాస పండు అని కూడా అంటారు. పైనాపిల్ జ్యూస్ లో బ్రోమైలిన్ (Bromylin) అనే ఎంజాయ్ ఉంటుంది. ఇది మొటిమలను తగ్గించడమే కాకుండా చర్మానికి తగినంత తేమను అందించి తాజాగా ఉంచుతుంది. అలాగే కోల్లాజెన్ (Collagen) ఉత్పత్తిని పెంచి చర్మంపై ముడుతలు లేకుండా చేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
చర్మానికి తగిన పోషణ అందించడంలో పైనాపిల్ జ్యూస్ సహాయపడుతుంది. కనుక పైనాపిల్ జ్యూస్ ను తాగిన అన్ని రకాల చర్మ సమస్యలు (Skin problems) తగ్గి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పైనాపిల్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి, అమైనో యాసిడ్స్ (Amino acids) చర్మం సాగకుండా బిగుతుగా ఉండేలా సహాయపడుతాయి. కనుక చర్మ సౌందర్యం కోసం పైనాపిల్ ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
పైనాపిల్ పేస్ట్, బాదం ఆయిల్: ఒక కప్పులో కొద్దిగా పైనాపిల్ పేస్ట్ (Pineapple paste), కొద్దిగా బాదం ఆయిల్ (Almond oil) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది.
పైనాపిల్ జ్యూస్, నిమ్మరసం: ఒక కప్పులో కొద్దిగా పైనాపిల్ జ్యూస్ (Pineapple Juice), కొద్దిగా నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా కనీసం వారానికి రెండు మూడు సార్లు ముఖానికి అప్లై చేసుకుంటే మొటిమలు, మచ్చలు తగ్గి అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.
పైనాపిల్ పేస్ట్, తేనె, పెరుగు: ఒక కప్పులో కొద్దిగా పైనాపిల్ పేస్ట్ (Pineapple paste), కొద్దిగా తేనె (Honey), పెరుగు (Yogurt) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం చర్మకణాలలో పేరుకుపోయిన మృతకణాలను తొలగించి చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది.
అయితే అన్ని చర్మతత్వాలకు పైనాపిల్ తో చేసుకునే ఫేస్ ప్యాక్స్ (Face packs) సరిపోకపోవచ్చు. కనుక చర్మానికి పైనాపిల్ ఫేస్ ప్యాక్స్ ను అప్లై చేసుకునే ముందు చేతి మీద రాసి మంట, దురద వంటివి లేవని పరీక్షించుకున్న తరువాత ముఖానికి అప్లై చేసుకోవడం మంచిది. అప్పుడే అందమైన ముఖసౌందర్యం (Facial beauty) కోసం మీరు ఆశించిన ఫలితాన్ని పొందవచ్చును.