నెయ్యిని ఇలా తింటే విషమవుతుంది
నిజానికి నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ దీన్ని కొన్ని విధాలుగా మాత్రం తినకూడదు. ఎందుకంటే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో శక్తిని పెంచడానికి సహాయపడతాయి.అంతేకాదు నెయ్యిలో ఉండే ముఖ్యమైన ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి.
నెయ్యి మన ఆరోగ్యానికి ఎంత మంచిదైనా దీన్ని సరైన పద్దతిలో తినకపోతే గనుక ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును తప్పుగా దీన్ని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది. అసలు నెయ్యిని ఎలా తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నెయ్యితో కలిపి తినకూడనివి:
తేనె
చాలా స్వీట్లను తేనె, నెయ్యిని కలిపి చేస్తుంటారు. కానీ ఈ రెండింటితో చేసిన ఆహారాలు మన ఆరోగ్యానికి మాత్రం మంచివి కావంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ రెండూ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ తింటే పిత్త దోషం అసమతుల్యం అవుతుంది.
చల్లని పదార్థాలు
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నెయ్యిని చల్లని పదార్థాలతో అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది ఎన్నో శారీరక సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే నెయ్యి బరువుగా, జిగటగా ఉంటుంది. కాబట్టి దీన్ని చల్లని పదార్థాలతో తింటే శరీరం చల్లబడుతుంది. అలాగే ఇది తొందరగా అరగక జీర్ణ సమస్యలు వస్తాయి. నెయ్యిని చల్లని పదార్థాలతో కలిపి తింటే బరువు పెరగడం, పిత్త దోషం వంటి సమస్యలు వస్తాయి.
శరీరంలో విష పదార్థాలు ఉంటే
శరీరంలో ట్యాక్సిన్స్ ఉన్నవారు కూడా నెయ్యిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో నెయ్యిని తింటే అది జీర్ణం కాదు. ఇది మీ జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది.
నెయ్యిని ఎలా తినాలంటే?
- మీరు నెయ్యి ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం దీన్ని ప్రతిరోజూ వంటల్లో వాడొచ్చు. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
- వేడి వేడి అన్నంలో కూడా నెయ్యిని కలుపుకుని ఎంచక్కా తినొచ్చు.
- నెయ్యిని మధ్యాహ్న భోజనంలో సగం చెంచా నెయ్యి కలుపుకుని తింటే చాలా మంచిది. కానీ రాత్రిపూట మాత్రం నెయ్యిని అస్సలు తినకూడదు.
- నెయ్యిని తినేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు లేకుండా నెయ్యిని అస్సలు తినకూడదు.
- నెయ్యిని కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పులతో కూడా కలిపి తినొచ్చు. దీనివల్ల మీ శరీరం ఎనర్జిటిక్ గా ఉంటుంది.
నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు
ఎవరెవరు నెయ్యి తినకూడదు?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొంతమంది నెయ్యిని అస్సలు తినకూడదు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, గ్యాస్ సమస్యలు, కాలెయ వాపు, వాంతులు, కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు నెయ్యిని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.