చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే మీ కోసమే ఈ అద్భుతమైన చిట్కాలు!
కలుషిత వాతావరణం కారణంగా తల భాగంలో మురికి పేరుకుపోయి అది ఫంగస్ (Fungus) కు దారితీస్తుంది. దీంతో చుండ్రు (Dandruff) సమస్యలు ఏర్పడతాయి.

ఈ సమస్య కారణంగా జుట్టు అధికమొత్తంలో రాలిపోవడం, దురద, మంట వంటి సమస్యలు వేధిస్తాయి. దీంతో నలుగురిలో బయట కలవడానికి ఇబ్బందిపడతారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన కొన్ని చిట్కాలను ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి బయట మార్కెట్లో ఖరీదైన షాంపూలు అందుబాటులో ఉన్నాయి. ఈ షాంపూలలో ఉండే రసాయనాలు (Chemicals) చర్మకణాలను (Skin cells) దెబ్బతీస్తాయి. కనుక ఈ షాంపూలకు దూరంగా ఉండడమే మంచిది. తక్కువ ఖర్చుతో ఇంటిలో అందుబాటులో ఉండే పదార్థాలతో చుండ్రు సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.
వేప నూనె, ఆలివ్ ఆయిల్: వేప నూనె (Neem oil), ఆలివ్ ఆయిల్ (Olive oil) ను సమాన మోతాదులో తీసుకుని వేడి చేసుకోవాలి. ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకు, తల మాడుకు బాగా రాసుకోవాలి. అరగంట తరువాత గాఢత తక్కువగల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్యలు తగ్గుతాయి.
నిమ్మరసం: చుండ్రు సమస్యను తగ్గించడంలో నిమ్మరసం (Lemon juice) మంచి ఫలితాలను అందిస్తుంది. నిమ్మకాయ రసాన్ని తల మాడుకు అప్లై చేసుకుని సున్నితంగా పదిహేను నిమిషాల పాటు మర్దన (Massage) చేసుకోవాలి. ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చుండ్రు సమస్యలు తగ్గుతాయి.
మెంతులు: మెంతులను రాత్రంతా నానబెట్టి ఆ మరుసటి రోజు మెంతులను (Fenugreek) మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటితో తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు ప్రయత్నిస్తే చుండ్రు సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.
కొబ్బరి నూనె, నిమ్మకాయ రసం: కొబ్బరినూనెలో (Coconut oil) కొద్దిగా నిమ్మరసంను (Lemon juice) కలిపి ఈ మిశ్రమాన్ని తల మాడుకు బాగా అప్లై చేసుకొని పదినిమిషాల పాటు సున్నితంగా మర్దన చేసుకోవాలి. అరగంట తరువాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. కొబ్బరినూనె, నిమ్మకాయలలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గిస్తాయి.
అలోవెరా: అలోవెరాలో (Aloevera) యాంటీ బ్యాక్టీరియల్ (Antibacterial), యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రును సమర్థవంతంగా తొలగిస్తాయి. కనుక అలోవెరా జెల్ ను తలకు అప్లై చేసుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే చుండ్రు సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడాలో (Baking soda) ఉండే యాంటీ ఫంగల్ గుణాలు (Antifungal properties) దురద, మంట వంటి సమస్యలను తగ్గించడంతోపాటు చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం తడి జుట్టుకు బేకింగ్ సోడాను నేరుగా అప్లై చేసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. రెండు నిమిషాల తరువాత గాఢత తక్కువగల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్యలు తగ్గుతాయి.