రాత్రిపూట తొందరగా తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
మన జీవనశైలి మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పేలవమైన జీవనశైలి ఎన్నో రోగాలకు కారణమవుతుంది. దీనివల్ల మీ ఆయుష్షు తగ్గే అవకాశం కూడా ఉంది. చాలా తొందరగా డిన్నర్ చేయడం వల్ల ఎక్కువ కాలం జీవించొచ్చని ఒక అధ్యయనంలో తేలింది.
జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ లో ఒక అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట త్వరగా తినడం వల్ల మీ జీవిత కాలం పెరుగుతుందని తేలింది. ఇటలీలోని ఓ గ్రామంలోని ప్రజలపై జరిపిన ఈ అధ్యయనంలో 90 ఏండ్లు పైబడిన వారందరూ రాత్రి 7 గంటలకు భోజనం చేస్తున్నట్టు తేలింది. అలాగే వీళ్లు కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తింటున్నారు. ముఖ్యంగా వీరు మొక్కల ఆధారిత ఆహారాన్నే ఎక్కువగా తింటున్నట్టు తేలింది. వీళ్ల ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, కాయధాన్యాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి ప్రజల జీవనశైలి కూడా చాలా చురుగ్గా ఉంటుంది. జీవనశైలి మన జీవన నాణ్యతపై ఎంతో ప్రభావం చూపుతుంది. మరి తొందరగా డిన్నర్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియకు మేలు
రాత్రి తొందరగా డిన్నర్ చేయడం వల్ల జీర్ణక్రియకు ఎంతో మేలు జరుగుతుంది. రాత్రి ఏడు గంటలకు తినడం వల్ల నిద్రపోవడానికి చాలా సమయం ఉంటుంది. దీంతో మీరు తిన్నది బాగా జీర్ణమవుతుంది. రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే మన శరీర పనితీరు మందగిస్తుంది. అందుకే రాత్రిపూట త్వరగా తినండి. ఇది మీ జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది.
మంచి నిద్ర
డిన్నర్ కు నిద్రపోవడానికి మధ్య ఎక్కువ సమయం ఉండటం వల్ల మీకు బాగా నిద్ర పడుతుంది. తిన్నది సులభంగా జీర్ణం కావడం వల్లే ఇలా జరుగుతుంది. అజీర్థి సమస్య తక్కువగా ఉండటం వల్ల నిద్ర బాగా పడుతుంది.
బరువు తగ్గడానికి
రాత్రి తొందరగా తినడం వల్ల మీరు బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. అలాగే మీ మెటబాలిజం కూడా పెరుగుతుంది. దీంతో నిద్రపోయే ముందు మీరు తిన్న ఆహారం చాలావరకు జీర్ణమవుతుంది. రాత్రిపూట మీకు వీటిని తినాలి, వాటిని తినాలి అన్న కోరిక కూడా ఉండదు. దీంతో మీరు అతిగా తినలేరు.
eating
రక్తంలో చక్కెర నియంత్రణ
రాత్రిపూట త్వరగా తినడం వల్ల మీ శరీరానికి ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అలాగే మీ శరీరం అన్ని పోషకాలను బాగా గ్రహిస్తుంది. త్వరగా తినడం వల్ల మీ శరీరం ఇన్సులిన్ ను బాగా ఉపయోగించగలుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగవు. ఈ అలవాటు గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.