రోజుకు ఎన్ని వేల అడుగులు నడిస్తే మంచిది? నడకతో ఆయుష్షు పెరుగుతుందా?
ఆరోగ్యానికి, మానసిక ఉత్సాహానికి వాకింగ్ చాాలా మేలు చేస్తుంది. కాస్త వీలు చేసుకొని ఉదయం ఓ గంట, సాయంత్రం ఓ గంట నడిస్తే చాలు. ఆరోగ్యానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత మన సొంతం. అయితే చాలా మందిలో వాకింగ్ గురించి కొన్ని డౌట్లు ఉంటాయి. దానికితోడు రోజూ 10వేల అడుగులు నడిస్తేనే ఆరోగ్యానికి మేలు కలుగుతుందనే ప్రచారం ఇటీవల బాగా జరుగుతోంది. అయితే అది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం.

అది అపోహే
ఆరోగ్యానికి మేలు చేసే అలవాట్లలో వాకింగ్ ముఖ్యమైంది. కొందరు ఉదయం, సాయంత్రం వాకింగ్ కోసం ప్రత్యేకంగా టైం కేటాయిస్తూ ఉంటారు. మరికొందరు ఎప్పుడు వీలైతే అప్పుడు కాసేపు నడుస్తూ ఉంటారు. నడక వల్ల బరువు తగ్గడమే కాకుండా మానసికంగానూ ఉత్సాహంగా ఉంటారు. అయితే ఈ నడకపై జనాల్లో చాలా అపోహలు ఉన్నాయి. అందులో ఒకటి రోజుకి 10వేల అడుగులు నడవడం.
తక్కువ నడిచినా ఏం కాదు
చాలామంది రోజుకి 10వేల అడుగులు నడిస్తేనే ఆరోగ్యం అనుకుంటారు. ఎలాగైనా నడవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. కొందరికి సమయం, శరీరం సహకరించవు. దాంతో వాళ్లు నిరాశ చెందుతారు. అయితే తక్కువ అడుగులు నడిచినా ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు నిపుణులు.
ఒత్తిడికి గురికావద్దు
రోజూ మితమైన వ్యాయామం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. 10 వేల అడుగులు అంటే ఎక్కువ సమయం, వేగం అవసరం. ఇది ప్రతిరోజూ సాధించడం అందరికీ సాధ్యం కాదు. నిపుణులు వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సలహా ఇస్తున్నారు. ఎక్కువ నడవాలనే ప్రయత్నంలో మానసిక ఒత్తిడికి గురికాకూడదని హెచ్చరిస్తున్నారు.
ఎన్ని అడుగులు నడవాలి?
నిపుణుులు, శాస్త్రవేత్తల సూచనల ప్రకారం తక్కువ అడుగులు నడవడమే ఆరోగ్యానికి మంచిదట. రోజుకి 7,500 అడుగుల కంటే ఎక్కువ నడిచినా అదనపు ప్రయోజనాలు ఉండవట. 7,500 అడుగులు నడిస్తే 42 శాతం వరకు మానసిక ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎలా నడవాలి?
నడుస్తున్నప్పుడు కొన్ని నిమిషాలు చురుగ్గా, మరికొన్ని నిమిషాలు నెమ్మదిగా నడవడం మంచిది. అంటే 30 నిమిషాల్లో 10 నిమిషాలు వేగంగా, 20 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. శరీరం ఆ వేగానికి అనుగుణంగా ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది.
అధ్యయనాల ప్రకారం
రోజూ 4,400 అడుగులు నడిస్తే ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. హఠాత్తు మరణాలను తగ్గించుకోవడానికి రోజుకి 8వేల అడుగులు నడవొచ్చని లీసెస్టర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ టామ్ యేట్స్ అంటున్నారు.