Cousin marriage: మేనరికం పెళ్లిళ్లు చేసుకుంటే ఆ విషయంలో వీక్‌గా ఉంటారా.?
Cousin marriage: మన దేశంలో మేనరికం వివాహాలు జరగడం సర్వసాధారణం. అయితే ఇలాంటి పెళ్లిళ్ల కారణంగా జెనెటిక్ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయితే మేనరికంతో కేవలం పుట్టే పిల్లల విషయంలోనే కాకుండా మరో సమస్య కూడా ఉంటుంది.

మేనరికాల్లో వచ్చే ప్రధాన సమస్యలు
సాధారణంగా రక్తసంబంధం ఉన్న పేరెంట్స్‌కి పుట్టే పిల్లల్లో 8 శాతం మంది అవకారాలతో పుట్టే అవకాశం ఉంటుంది. భార్య భర్తల మధ్య జన్యుసారూప్యం ఎంత అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. బావమరదళ్ల కంటే, మేనమామ మేనకోడలి మధ్య జన్యుసారూప్యం ఎక్కువ, అలాగే కుండ మార్పిడిలో అవే జన్యువులు మాటిమాటికీ పంచుకోవడం వలన ఇంకా ఎక్కువ. ఇలాంటి జంటల్లో అబార్షన్లు ఎక్కువవటం, మృత శిశువులు జన్మించటం, పుట్టినపిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, గుండెలో అవకారాలు, బుద్ధిమాంద్యంతో పాటు ఇతర మానసిక సమస్యలు, మెదడు జబ్బులు, రక్తహీనత మొదలైన రకరకాల సమస్యలు కనిపిస్తాయి.
దాంపత్య జీవితంపై కూడా ప్రభావం
అయితే మేనరిక వివాహాలు అనేవి కేవలం పుట్టబోయే పిల్లలపై మాత్రమే కాదు జంటల దాంపత్య జీవితాలపై కూడా ప్రభావం చూపుతుంది. సాధారణంగా మేనరికం అంటే ఆ జంటలకు చిన్ననాటి నుంచే పరిచయం ఉండి ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్య దాంపత్య సంబంధిత కోరికలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకరికి కోరిక ఉన్నా మరొకరికి అంతలా కోరిక ఉండకపోవచ్చు.
లైంగిక ఆకర్షణ తక్కువ
అయితే మేనరికంలో ఉన్న వారికి ఒకరిని ఒకరు ఇష్టపడుతుండొచ్చు కానీ వారి మధ్య లైంగిక ఆకర్షణ ఉండదు. ఈ కారణంగా వీరిద్దరి మధ్య శారీరక బంధం బలపడదు. ఇద్దరూ అందంగా ఉన్నా ఒకరిపై ఒకరికి కోరిక కలగదు. శారీరక బంధం బలంగా ఉండాలంటే లైంగిక ఆకర్షణ సరిగ్గా ఉండాలి. ఇలా లేకపోతే ఇది జంటలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఇతరులపై వ్యామోహం
ఇలాంటి వారు ఇతరులపై కోరిక పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. తన భాగస్వామి ఎంత అందంగా ఉన్నా.. అంతకంటే తక్కువ అందమున్న మరో వ్యక్తికి ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. లైంగిక ఆకర్షణ ఉంటేనే శారీరక సంబంధాలు బలంగా ఉంటాయి. మేనరికంలో లైంగిక ఆరోగ్యం దెబ్బతినడంలో ఎలాంటి జీన్స్ ప్రభావం ఉండదు. కేవలం మానసిక సంబంధిత ప్రభావమే ఉంటుంది.
పూర్తి వీడియో ఇక్కడ చూడండి..
(ఇక్కడ డాక్టర్ గొపరాజు సమరం గారు తెలిపిన వైద్య సమాచారం, అభిప్రాయాలు, ఆయన వైద్య అనుభవం, ప్రజారోగ్య రంగంలో చేసిన సేవల ఆధారంగా అందించాము. దీనిని కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఇది వైద్యుల సలహాకు బదులుగా భావించకండి. దయచేసి మీ ఆరోగ్య పరిస్థితులకు సరైన నిర్ధారణ, చికిత్స కోసం అర్హత గల వైద్యులను సంప్రదించండి.)