Nano Banana Scam: వామ్మో ఈ 3డీ బొమ్మల వెనకాల ఇంత మోసం ఉందా.? జాగ్రత్తగా ఉండండి
Nano Banana Scam: సోషల్ మీడియాలో నానో బనానా పేరుతో ఓ ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. సాధారణ ఫొటోలను 3డీ ప్రింట్ రూపంలోకి మార్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ నానో బనానా ట్రెండ్ వెనకాల ఒక మోసం దాగుందని తెలుసా?

నానో బనానా స్కామ్ ఎలా జరుగుతుంది?
ప్రతీ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే సైబర్ మోసగాళ్లు నానో బనానా ట్రెండ్‌ను సైతం వాడుకుంటున్నారు. అసలు వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. ఈ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఫిషింగ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఫొటో అప్‌లోడ్ చేయమని లేదా ఏదైనా ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయమని అడుగుతారు. ఒకవేళ ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేశారో అంతే సంగతులు.. మీ ఫోన్‌లోని వ్యక్తిగత డేటా, మెసేజ్‌లు, బ్యాంకింగ్ యాప్స్ వివరాలు ఇలా అన్ని స్కామర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి.
నకిలీ వెబ్‌సైట్స్‌ను ఎలా గుర్తించాలి.?
ఇవి దాదాపు అసలు వెబ్‌సైట్స్‌ని పోలి ఉంటాయి. అయితే యూఆర్ఎల్‌లో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఫేక్ డొమైనలను ఉపయోగిస్తుంటారు. ఒక వెబ్‌సైట్ క్లిక్ చేస్తే మరో వెబ్‌సైట్‌కి రీ డైరెక్ట్ కావడం. ఓటీపీలు వంటివి అడగడం లేదా మీ ఫోన్‌ను రిమోట్ యాక్సిస్ రిక్వెస్ట్ చేయడం వంటివి కూడా ఈ స్కామ్‌లో జరుగుతుంటాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
లింక్ చూసినపుడు డొమైన్ పేరు జాగ్రత్తగా పరిశీలించండి. చిన్న స్పెల్లింగ్ లేదా అదనపు పదాలు ఉంటే సందేహించండి. నానో బనానో వంటి వాటిలో ఎలాంటి ఓటీపీలను అడగరనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ ఎవరైనా అలా అడిగితే అది ఫేక్ అని అర్థం. అనవసరంగా SMS, కాల్ లేదా ఫైల్ యాక్సెస్ అడిగితే ఇవ్వద్దు. యూజర్ రివ్యూలు, డెవలపర్ సమాచారం పరిశీలించండి. యాప్‌కి సంబంధించి ఫీడ్‌బ్యాక్‌ను చదవండి. ఎక్కువ మంది యూజర్లు స్కామ్ అని పేర్కంటే అలాంటి వాటికి దూరంగా ఉండండి.
సందేహం వచ్చిన వెంటనే ఇలా చేయండి.
ఒకవేళ మీరు మోసపోయినట్లు అనుమానం వస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. ఈ బ్యాంకింగ్ వివరాలు లీక్ అయ్యాయని అనుమానం వచ్చినా, అమౌంట్ కట్ అయినా వెంటనే సైబర్ సెక్యూరిటీ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేయండి. మీ కార్డులను బ్లాక్ చేసుకోండి. ఫోన్‌లో అనుమానాస్పద యాప్ ఇన్‌స్టాల్ అయితే వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేయండి. అవసరమైతే రీబూట్ చేసి ఫ్యాక్టరీ రీసెట్ చేయండి.
ఏఐ విషయంలో జాగ్రత్తలు..
ఏఐ ఇమేజ్ జెనరేటర్ ఉపయోగించేటప్పుడు ఆఫీషియల్ వేదిక లేదా పెద్ద బ్రాండ్‌లను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఓటీపీలు ఎవరితో షేర్ చేయకూడదు. మెసేజ్‌ల రూపంలో వచ్చే లింక్‌లను క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఫోన్, ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఎప్పుడూ ఇన్‌స్టాల్ చేయండి. మీ వ్యక్తిగత ఫొటోలను పంపే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే యాంటీ వైరస్ టూల్స్‌ని ఉపయోగించుకోండి.