అన్నానికి బదులుగా చపాతీలను తింటే..!
కొంతమంది బరువు పెరిగిపోతున్నామని.. అన్నానికి బదులుగా చపాతీలను తింటుంటారు. అన్నంలో కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీర బరువును పెంచేస్తాయి. అలా అని అన్నాన్ని మొత్తమే మానేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

చాలా వరకు మనం తినే ఆహారమే మన ఆరోగ్యం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. అందుకే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలనే తినాలి. అన్ని రకాల పోషకాలను ఖచ్చితంగా తీసుకోవాలి. శరీరంలో ఏ పోషకం లోపించినా దానికి సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి.
బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది డైట్ ను ఫాలో అవుతుంటారు. ఇలాంటి వారు చాలా ఆహారాలకు దూరంగా ఉంటారు. కానీ కొన్ని ఆహారాలను మొత్తమే మానేయడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకునే ముందు డైటీషియన్ లేదా డాక్టర్ తో మాట్లాడటం మంచిది. డైట్ ను ఫాలో అయ్యే కొంతమంది అన్నానికి బదులుగా చపాతీలు తింటారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు అన్నం మానేసి చపాతీలను తినడం మంచిది కాదు. అంతేకాదు ఇప్పుడు దొరికే గోధుమలు మునుపటిలా లేవు. ఇందులో నాణ్యత, పోషకాహారం లోపించిందని నిపుణులు చెబుతున్నారు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఎండోమెట్రియోసిస్, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, చిన్న పేగు బ్యాక్టీరియా పెరుగుదల, ఇన్సులిన్ సున్నితత్వం వంటి వ్యాధులు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు అన్నాన్ని ఖచ్చితంగా తినాలి.
వీరు వైట్ రైస్ ను తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అన్నంతో పాటుగా దానితో పాటుగా తినే కూరల విషయంలో జాగ్రత్త వహించాలి. ఇలాంటి వారు మంచి పోషకాలున్న కూరలను పుష్కలంగా తినాలి. అన్నాన్ని లిమిట్ లో తినాలి. వీటితో పాటుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, కూరగాయలను తప్పనిసరిగా తినాలి. సాధారణంగా వైట్ రైస్ అనారోగ్యకరమైనదని ప్రజలు భావిస్తారు. కానీ దీనిని తినేటప్పుడు ఇలాంటి భయాలేమీ పెట్టుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వైట్ రైస్ ను మితంగా తింటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.