క్యాలీఫ్లవర్ మసాలా కూర.. ఇలా చేస్తే నోరూరిపోతుంది!
క్యాలీఫ్లవర్ తో మనం ఎక్కువగా మంచూరియా, గోబి 65 వంటి వంటలను వండుకుంటుంటాం. అయితే ఇలా తరచూ చేసుకునే స్నాక్ ఐటమ్స్ లకు బదులుగా క్యాలీఫ్లవర్ తో మసాలా కూరను వండుకుంటే చాలా స్పైసీగా (Spicy), రుచిగా ఉంటుంది.

ఈ మసాలా కూర అన్నం, పూరి, చపాతి, రోటీలలోకి చాలా బాగుంటుంది. ఈ మసాలా కూరను సులభంగా వండుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ మసాలా కూర (Cauliflower Masala Curry) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: ఒక చిన్న క్యాలీఫ్లవర్ (Cauliflower), రెండు ఉల్లిపాయలు (Onions), రెండు పచ్చిమిరపకాయలు (Green chilies), రెండు టమోటాలు (Tomatoes), ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), పావు స్పూన్ పసుపు (Turmeric), సగం స్పూన్ జీలకర్ర (Cumin), రుచికి సరిపడా ఉప్పు (Salt).
సగం స్పూన్ గరం మసాలా (Garam masala), ఒక టేబుల్ స్పూన్ కారం పొడి (Chilli powder), సగం స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), సగం స్పూన్ ధనియాల పొడి (Coriander powder), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, రెండు స్పూన్ ల బటర్ (Butter), ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ (Fresh cream), నాలుగు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా క్యాలీఫ్లవర్ ను శుభ్రపరచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి మూడు గ్లాసుల నీళ్లు, పసుపు (Turmeric), కొంచెం ఉప్పు (Salt) వేసి వేడిచేసుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి రెండు మూడు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నీటిలో నుంచి క్యాలీఫ్లవర్ ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి వేగిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగువేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై (Fry) చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంతవరకు ఫ్రై చేసుకోని పసుపు, గరం మసాలా, కారం పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడు ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
మసాలాలన్నీ బాగా వేగిన తరువాత టమోటా పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టమోటా పేస్ట్ వేగిన తరువాత క్యాలీఫ్లవర్ ముక్కలు, ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు తక్కువ మంట (Low flame) మీద ఉడికించుకోవాలి. కూర బాగా ఉడికి కూర నుంచి నూనె పైకి తేలే సమయంలో బటర్, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) స్పైసీ క్యాలీఫ్లవర్ మసాలా కూర రెడీ.