కడుపులో నులిపురుగులు తొలిగిపోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!
సాధారణంగా చిన్నపిల్లలలో నులిపురుగుల (Worms) సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే పెద్దలలో కూడా ఈ సమస్య అరుదుగా కనిపిస్తుంది.

రోగనిరోధక శక్తి (Immunity) తక్కువగా ఉండే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరి కడుపులో నులిపురుగులు ఏర్పడడానికి గల కారణాలు, లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొందరిలో ఈ సమస్య తొందరగా బయటపడదు. ఎటువంటి లక్షణాలు లేకుండా ఏళ్ల తరబడి దీర్ఘకాలం ఉండడంతో శరీరానికి అవసరమైన పోషకాలు (Nutrients) అందకపోవడంతో బలహీనంగా (Weakly) కనిపిస్తారు. తీసుకునే ఆహారంలోని పోషకాలన్నీ నులిపురుగులు పీల్చుకుంటాయి. దీంతో నీరసంగా, బలహీనంగా కనిపించడం జరుగుతుంది.
కడుపులో నులిపురుగులు ఏర్పడడానికి గల కారణాలు: కలుషితమైన ఆహార పదార్థాలను (Contaminated food items) తీసుకోవడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, మల, మూత్ర విసర్జన తరువాత, భోజనానికి ముందు చేతులను శుభ్రపరచుకోకుండా ఉండడం, గోర్లు కొరకడంతో (Biting nails) ఈ సమస్య ఏర్పడుతుంది.
అలాగే పూర్తిగా ఉడకని మాంసం (Undercooked meat) తినడంతో కూడా కడుపులో నులిపురుగులు ఏర్పడతాయి. అంతేకాకుండా సరైన ఆహారపు నియమాలను పాటించకపోవడం, కలుషితమైన నీటిని (Contaminated water) తాగడంతో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు.
కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు: కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు ముఖ్యంగా కనిపించే లక్షణం మలద్వారం (Anus) దగ్గర దురద (Itching). ఈ సమస్యను చిన్న పిల్లల్లో అధికంగా చూస్తుంటాము. మలద్వారం నుంచి నులిపురుగులు రావడంతో చిన్నపిల్లలు అసౌకర్యంగా భావిస్తారు.
stomach pain
అలాగే మలవిసర్జనలో చిన్న చిన్న పురుగులు పడడం, మలద్వారం, యోని దగ్గర దురదగా మంటగా అనిపించడం జరుగుతుంది. ఎంత తిన్నా బరువు పెరగకపోవడం (Not gaining weight), క్రమక్రమంగా బరువు తగ్గడం (Weight loss) జరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, తరచుగా కడుపు నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కడుపులో గ్యాస్, వికారం, మలబద్ధకం, చికాకు, అసౌకర్యంతో రాత్రిపూట సరిగా నిద్ర రాకపోవడం (Insomnia), శరీరం అంతా నొప్పులు, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తహీనత (Anemia) ఏర్పడుతుంది. అలాగే దద్దర్లు చర్మం పొడిబారం వంటి చర్మ సమస్యలు కూడా కనిపిస్తాయి. అలాగే శారీరకంగా మానసికంగా ఎదుగుదల లోపిస్తుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత, ఆహారానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఆరుబయట మల, మూత్ర విసర్జన (Urination) చేయరాదు. సరిగా ఉడికిన ఆహారాన్ని (Cooked food) తీసుకోవాలి. ముఖ్యంగా బాగా ఉడికించిన మాంసాన్ని మాత్రమే తీసుకోవాలి.
అలాగే సరైన ఆహారపు నియమాలను (Proper diet) పాటించాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. పిల్లలు నోట్లో చెయ్యి పెట్టుకోవడం, గోర్లు కొరకడం చేయరాదు. రోగనిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. పిల్లలలో నులిపురుగుల సమస్య ఉందని తెలిస్తే వైద్యులను సంప్రదించి తగిన సూచనలు (Instructions) పాటిస్తే మంచిది.