ఒత్తైన, పొడవైన జుట్టు కోసం బెస్ట్ హెయిర్ ప్యాక్స్.. అవేంటంటే?
అరటిపండులో (Banana) అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే.

ఇందులో ఉండే పోషకాలు చర్మ, జుట్టు సౌందర్యానికి కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. అరటిపండుతో చేసుకునే హెయిర్ ప్యాక్స్ (Hair packs) జుట్టు సమస్యలను తగ్గించి వాటి సౌందర్యాన్ని మరింత రెట్టింపు చేస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఒత్తైన, పొడవైన జుట్టు సౌందర్యం కోసం అరటి పండు ఫేస్ ప్యాక్స్ ల తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
అరటిపండులో బయోటిన్ (Biotin) ఉంటుంది. ఇది జుట్టుకు మంచి కండిషనర్ (Conditioner) గా సహాయపడి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు జుట్టు పొడిబారే సమస్యలను తగ్గించి జుట్టుకు తగిన తేమను అందిస్తాయి. కనుక బయట మార్కెట్ అందుబాటులో ఉండే ఖరీదైన హెయిర్ ప్యాక్స్ కి బదులుగా అరటిపండుతో చేసుకునే హెయిర్ ప్యాక్ ను ఉపయోగిస్తే జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.
అరటిపండు, పెరుగు, రోజ్ వాటర్: జుట్టుకు తగిన పోషణ లభించకపోవడంతో జుట్టు చివర పగుళ్లు ఏర్పడతాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఒక కప్పులో అరటిపండు గుజ్జు (Banana pulp), రెండు టేబుల్ స్పూన్ ల పెరుగు (Yogurt), రెండు టేబుల్ స్పూన్ ల రోజ్ వాటర్ (Rosewater) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా అప్లై చేసుకుని అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో గాడత తక్కువగల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు పగుళ్లు తగ్గుతాయి.
సెనగపిండి, అరటిపండు గుజ్జు: కలుషిత వాతావరణం కారణంగా జుట్టు కుదుళ్లు బలహీనపడి జుట్టు అధిక మొత్తంలో రాలిపోతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఒక కప్పులో అరటిపండు గుజ్జు (Banana pulp), సెనగపిండిని (Gramflour) తీసుకోని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు, జుట్టుకు బాగా అప్లై చేసుకుని గంట తరువాత గాడత తక్కువగల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు కుదుళ్లు బలపడి జుట్టురాలే సమస్యలు తగ్గుతాయి.
అరటిపండు, తేనె: జుట్టుకు తగిన తేమ అందకపోవడంతో జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఒక కప్పులో బాగా పండిన ఒక అరటి పండు గుజ్జు (Banana pulp), రెండు టేబుల్ స్పూన్ ల తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా అప్లై చేసుకుని ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేసుకుంటే జుట్టుకు తగిన తేమ అంది జుట్టు పొడిబారే సమస్యలు తగ్గుతాయి.
అరటిపండు, పెరుగు, గ్లిజరిన్, బాదం నూనె: జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలంటే తగిన పోషక తప్పనిసరి. ఇందుకోసం ఒక కప్పులో అరటిపండు గుజ్జు (Banana pulp), ఒక టీ స్పూన్ గ్లిజరిన్ (Glycerin), కొద్దిగా పెరుగు (Yogurt), బాదం నూనె (Almond oil) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా అప్లై చేసుకొని గంట తరువాత గాఢత తక్కువగల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టుకు తగిన పోషణ అంది జుట్టు ఒత్తుగా, పొడవుగా, బలంగా పెరుగుతుంది.