Almonds Benefits: తేనెలో నానబెట్టిన బాదం తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది తెలుసా?
నానబెట్టిన బాదం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది నైట్ నానబెట్టి పొద్దున్నే వాటిని తొక్కతీసేసి తింటూ ఉంటారు. కానీ వాటర్ కి బదులు బాదంపప్పును తేనెలో నానబెట్టి తింటే ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాదం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా నానబెట్టిన బాదం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మనం రెగ్యులర్ గా బాదాన్ని నీళ్లలో నానబెట్టి తింటుంటాం. కానీ బాదం పప్పును తేనెలో నానబెట్టి తింటే ఎలా ఉంటుందో మీకు తెలుసా? దానివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా?
పోషకాలు పుష్కలం
బాదంలో అనేక విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నానబెట్టిన బాదంలో పోషకాలు రెట్టింపు అవుతాయి. నానబెట్టిన బాదంలో మెగ్నీషియం, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు, గుండె, చర్మానికి చాలా మంచివి. అంతేకాదు బాదంలో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శక్తితో పాటు మంచి జీర్ణక్రియకు సహాయపడతాయి.
తేనెలోని పోషకాలు:
తేనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తేనెలో ఉండే అలెర్జీ నిరోధక లక్షణాలు గాయాలను నయం చేయడానికి సహాయపడతాయి.
మెదడుకు మంచిది:
బాదంలో ఉండే విటమిన్ ఇ, మెగ్నీషియం, కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. తేనెలో ఉండే సహజ చక్కెర మెదడుకు శక్తినిస్తుంది. కాబట్టి, ఈ రెండింటినీ కలిపి తింటే మెదడు నరాలు బలపడతాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తేనెలో నానబెట్టిన బాదం నిరంతరం తింటే కొన్ని వారాల్లోనే మీ జ్ఞాపకశక్తి పెరగడాన్ని గమనించవచ్చు.
హృదయానికి మంచిది:
తేనెలో నానబెట్టిన బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హృదయానికి చాలా మంచివి. తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
జీర్ణవ్యవస్థ:
బాదంలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. తేనెలో సహజంగానే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. బాదంలో ఉండే పోషకాలు కూడా శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కాబట్టి తేనెలో నానబెట్టిన బాదం నిరంతరం తింటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
జుట్టుకు మంచిది:
బాదంలో ఉండే విటమిన్ ఇ, తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తింటే చర్మం కాంతివంతంగా, జుట్టు దట్టంగా మారుతుంది.
బరువు తగ్గడం:
తేనెలో నానబెట్టిన బాదం తింటే జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల బరువు సులభంగా తగ్గవచ్చు.
ఎలా తినాలి?
రాత్రి పడుకునే ముందు రెండు స్పూన్ల తేనెలో 4-5 బాదం నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలను మనం చూడవచ్చు.