కాకరకాయ జ్యూస్ ను తాగితే ఇంత మంచిదా?
కాకరకాయను తినడానికి ముఖం వికారంగా పెడుతుంటారు చాలా మంది. కానీ కాకరకాయలో ఎన్నో ఔషదగుణాలున్నాయి తెలుసా? ముఖ్యంగా కాకరకాయ జ్యూస్ ను అపుడప్పుడు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు తప్పుతుంది.

bitter gourd
కాకరకాయ అనేక పోషకాలను కలిగి ఉన్న కూరగాయ. కాకరకాయ రుచి చేదుగా ఉంటుందని చాలా మంది దీన్ని అస్సలు తినరు. కానీ ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాకరకాయలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. ఈ కూరగాయలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
కాకరకాయలో పాలీపెప్టైడ్-పి లేదా పి-ఇన్సులిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం. ఇది సహజ పద్ధతిలో మధుమేహాన్ని నియంత్రిస్తుందని రుజువైంది. కాకరకాయ జ్యూస్ ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
కాకరకాయలో కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. అయితే కాకరకాయ చేదును వదిలించుకోవాలంటే కాకరకాయ రసంలో కొద్దిగా తేనె లేదా బెల్లం కలిపి తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు కాకరకాయ జ్యూస్ ప్రతిరోజూ తాగొచ్చు.
కాకరకాయ జ్యూస్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం బాగా తగ్గుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
కాకరకాయ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల జుట్టు రాలడం, జుట్టు తెల్లబడటం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. హెయిర్ ఫాల్ ను నివారించడం, చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గించుకోవడానికి కాకరకాయ ఉత్తమ నివారణ.
bitter gourd
కాకరకాయలో కేలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి కాకరకాయ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది.
కాలేయాన్ని సంరక్షించడానికి కూడా కాకరకాయ ఎంతో సహాయపడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యలున్న వారు కాకరకాయను రోజూ పరిగడుపున తినొచ్చు లేదా జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడానికి కాకరకాయ బాగా సహాయపడుతుంది. కాకరకాయ శరీరంలోని క్రిములను నాశనం చేస్తుంది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులను తొలగించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.