Hair care: చుండ్రు తగ్గడానికి షాంపూ వాడుతున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి!
చుండ్రు చాలామందిని వేధిస్తున్న సమస్య. దీనివల్ల తల తరచూ దురద పెడుతూ ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అంతేకాదు చుండ్రు భుజాలపై రాలడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. చుండ్రు తగ్గడానికి చాలామంది రకరకాల చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారు. ఎక్కువశాతం యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడుతూ ఉంటారు. అయితే ఈ షాంపూలను కూడా ఎక్కువకాలం వాడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. వాడితే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

వేసవి కాలమైనా, వాన కాలమైనా, ఏ కాలమైనా సరే అందరినీ వేధించే సమస్య చుండ్రు. దీన్ని డాక్టర్‌కి చూపించాలా లేదా షాపులో దొరికే యాంటీ-డాండ్రఫ్ ప్రాడక్టులు వాడాలా అని చాలా మందికి సందేహం ఉంటుంది. నిజానికి చుండ్రు సమస్య తగ్గడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ప్రతిరోజు షాంపూ వాడలేం. రోజు షాంపూ చేసినా సమస్య ఎక్కువ అవుతుంది. మరి ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
షాంపూ ఎక్కువ రోజులు వాడితే?
యాంటీ డాండ్రఫ్ షాంపులను ఎక్కువకాలం వాడటం జుట్టు ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదు అంటున్నారు నిపుణులు. దానివల్ల చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. యాంటీ డాండ్రఫ్ షాంపూల్లో పెట్రోలియం శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తలపై చర్మానికి హాని కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జుట్టు పొడిబారడం..
జుట్టుకు రక్షణగా థిమెథికోన్ పనిచేస్తుంది. పదే పదే యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడితే కచ్చితంగా నెత్తిని డ్రై చేస్తుంది. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది. జుట్టు పొడిబారడం, రాలడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
చుండ్రు నివారణ ఆలస్యం
షాంపూలో ఉండే రెటినాల్, పామిటిక్ ఆమ్లాల ఎస్టర్ తలపై భాగాన్ని ఎరుపు చేసి దురద, పొట్టు రాలేలా చేస్తుంది. స్కాల్ప్ డ్రై అవుతుంటే చుండ్రు నివారణ మరింత ఆలస్యం అవుతుంది.
షాంపూ ఎప్పుడు ఆపాలి?
చుండ్రు తగ్గుతున్న కొద్దీ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఆపేయాలి. ఇది కనీసం ఒక నెల. ఆ తర్వాత మీరు ఎప్పుడూ వాడే షాంపూ వాడాలి. ఏడాది పొడవునా యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడితే మీ జుట్టు పలుచబడుతుంది.
సరైన కండీషనర్..
యాంటీ-డాండ్రఫ్ వాడిన తర్వాత సరైన కండీషనర్ వాడాలి. జుట్టును సరిగ్గా డ్రై చేయాలి ఆ తర్వాత హెయిర్ సీరమ్‌ను తప్పకుండా వాడాలి. ఒకటి రెండు గంటల తర్వాత తప్పకుండా తల దువ్వుకోవాలి.