బరువు తగ్గాలి అనుకునేవారు ఈ 7 తప్పులు అస్సలు చేయొద్దు అంటున్న డాక్టర్లు!
బరువు తగ్గడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఆరోగ్యం పాడు చేసుకుంటారు. బరువు తగ్గడం ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా తగ్గడం అంతకంటే ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఈ తప్పులు అస్సలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం
బరువు తగ్గాలనుకునేవారు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం అస్సలు మంచిది కాదు. ఉదయం ఆహారం తీసుకోకపోతే జీవక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా రోజంతా శరీరం తక్కువ కేలరీలు ఖర్చు చేస్తుంది. దీనివల్ల బరువు తగ్గకపోగా.. మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేసి మధ్యాహ్నం, రాత్రి ఎక్కువ తింటారు. బరువు తగ్గాలనుకునేవారు ఉదయం ఆరోగ్యకరమైన, తేలికైన, పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి.
ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం
ప్రోటీన్ కేవలం బలం కోసమే కాదు.. జీవక్రియ రేటు పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ ప్రోటీన్ తీసుకుంటే కండ కరగడం మొదలై.. కొవ్వు పేరుకుపోతుంది. అంతేకాదు ప్రోటీన్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే వెంట వెంటనే ఆకలి వేస్తుంది. దాంతో ఎక్కువగా తినే అవకాశం ఉంది. అలాగే ప్రోటీన్ లోపం వల్ల బలం తగ్గి అలసట, బలహీనత, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తగిన మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం మంచిది.
రాత్రి ఆలస్యంగా తినడం
రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే .. తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా కొవ్వుగా నిల్వ అయ్యే అవకాశం ఎక్కువ. అలాగే రాత్రి లేటుగా తినడం వల్ల గ్యాస్, అసిడిటి, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఇవి నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయి. లేట్ డిన్నర్ ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తుంది. దానివల్ల బరువు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రాత్రి భోజనాన్ని 8PM లోపు పూర్తిచేయడం మంచిది.
ఫైబర్ లేని ఆహారం తినడం
ఫైబర్ ఉన్న ఆహారం కడుపులో ఎక్కువ సేపు ఉండటం వల్ల పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఫైబర్ లేని ఫుడ్ తీసుకుంటే తరచూ ఆకలి వేస్తుంది. దానివల్ల ఎక్కువగా తినే పరిస్థితి వస్తుంది. ఫలితంగా బరువు తగ్గడం కష్టమవుతుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అది లేకపోతే మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు ఎక్కువవుతాయి. అంతేకాదు ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.
నిద్ర సరిగ్గా పోకపోవడం
సరైన నిద్ర లేకపోతే శరీరంలో ఘ్రెలిన్ అనే ఆకలిని పెంచే హార్మోన్ పెరుగుతుంది. దానివల్ల రోజంతా ఆకలి, తీపి, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ తినాలనే కోరికలు పెరుగుతాయి. నిద్రలేమి జీవక్రియను నెమ్మదిచేస్తుంది. ఒత్తిడిని పెంచే కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవడం మంచిది.
వ్యాయామాలపైనే ఆధారపడటం
వ్యాయామం శరీరానికి అవసరం అయినా బరువు తగ్గడంలో 70–80% పాత్ర డైట్‌దే. కేవలం ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల కొన్ని కేలరీలే ఖర్చవుతాయి. కానీ ఆ తర్వాత ఎక్కువ ఆకలి వేస్తుంది. ఇలా తీసుకునే కేలరీలు ఖర్చు చేసిన వాటిని మించిపోతే బరువు ఏమాత్రం తగ్గదు. నిజానికి బరువు తగ్గే ప్రయాణంలో స్మార్ట్ డైట్, సరైన వ్యాయామం, సరైన నిద్ర ముఖ్యమైనవి.
నీళ్లు తక్కువగా తాగడం
నీరు తక్కువగా తాగితే జీవక్రియ నెమ్మదిస్తుంది. నీరు సరిపోకపోవడం వల్ల ఆకలి, దాహం మధ్య తేడా గుర్తు పట్టలేక ఎక్కువగా తినే అవకాశం కూడా ఉంటుంది. అలాగే నీరు తక్కువగా తాగితే జీర్ణక్రియ బలహీనమై మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు శరీరాన్ని భారంగా, అలసిపోయినట్లు ఫీల్ అయ్యేలా చేస్తాయి. కాబట్టి రోజుకు కనీసం 2.5–3 లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

