వాకింగ్ లో ఇన్ని రకాలున్నాయా? ఒక్కో నడకతో ఒక్కో లాభం!
వాకింగ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాసేపు అలా సరదాగా నడిస్తే.. మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.

బరువు తగ్గించుకోవడానికి సాయపడే సులభమైన వ్యాయామం వాకింగ్. రోజూ వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుకునే వారు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. నడకలో కొన్ని రకాలు ఉన్నాయి. వాటి గురించి, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
నార్డిక్ వాకింగ్
ఈ వ్యాయామం ఫిన్లాండ్‌లో ప్రసిద్ధి చెందింది. కీళ్ల సమస్యలు ఉన్నవారు నార్డిక్ వాకింగ్ చేస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఏదైనా గాయాల నుంచి కోలుకున్నవారు ఈ విధంగా నడిస్తే మంచింది. ఈ వ్యాయామం స్కీయింగ్ లాంటిది. సాధారణంగా స్కీయింగ్ చేసేవారు చేతిలో 2 కర్రలను పట్టుకుంటారు. నార్డిక్ వాకింగ్ కూడా ప్రత్యేకంగా రూపొందించిన కర్రలతో నడవాలి. వాటితో నడిచేటప్పుడు మొత్తం శరీరానికి వ్యాయామం అవుతుంది. నార్ఢిక్ వాకింగ్ లో సాధారణం కంటే 40% వరకు ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
పవర్ వాకింగ్
చురుగ్గా, వేగంగా నడవడాన్ని పవర్ వాకింగ్ అంటారు. ఇది కీళ్లపై ప్రభావాన్ని తగ్గిస్తుంది. గుండెను బలోపేతం చేస్తుంది. కాళ్ళు, వీపు, నడుము తదితర భాగాల్లోని కండరాలను బలోపేతం చేయడానికి పవర్ వాకింగ్ సహాయపడుతుంది.
మైండ్‌ఫుల్ వాకింగ్
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ నడక సహాయపడుతుంది. ఈ నడకలో ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం, భావాలపై దృష్టి పెట్టడం, పరిసరాలను గమనించడం లాంటివి చేయాలి. మానసిక స్థితిని మెరుగుపరచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు.
వెయిట్ వాకింగ్
నడకకు అదనపు ప్రయోజనం కోసం బరువులతో నడవవచ్చు. బరువున్న వెస్ట్ బెల్ట్ ధరించి, వేగంగా లేదా ఎక్కువసేపు నడవాలి. ఈ వ్యాయామం కండరాలను ఎక్కువగా పనిచేయిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నడుము, కాళ్ళు, వీపు బలపడతాయి. మీ బరువులో 10 శాతం కంటే ఎక్కువ బరువుతో నడవవచ్చు. అనుభవం పెరిగే కొద్ది బరువును పెంచుకోవచ్చు.
ఆరోగ్యానికి నడక
ఏ వాకింగ్ అయినా.. ప్రతిరోజూ చేసినప్పుడు మాత్రమే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. ఒకరోజు నడిచినంత మాత్రాన బరువు నియంత్రణలోకి రాదు. అప్పుడప్పుడు నడవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కవు. కాబట్టి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడాన్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.