మీరు మాంసాహారులా.. అయితే అతిగా తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. మన ఆహారజీవన శైలిలో తీసుకునే ఆహార పదార్థాలు శరీర అవయవాల పనితీరుపై ప్రభావితం చూపుతాయి. అయితే ప్రస్తుత కరోనా కాలంలో చాలామంది శరీర వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం కోసం అధిక మొత్తంలో మాంసం తినేందుకు ఇష్టపడుతున్నారు. మాంసం తినడం ఆరోగ్యానికి మంచిదే.

అలాగని కొంతమందికి మాంసం లేనిదే ముద్ద దిగదు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదని తాజా అధ్యయనంలో తేలింది. అతిగా మాంసం తీసుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య నష్టాలు (Health risks) కలుగుతాయి. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అదే అతిగా తీసుకుంటే అనారోగ్యం కలుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా అతిగా మాంసం (Meat) తింటే శరీరానికి కలిగే కష్టాలు ఏంటో తెలుసుకుందాం..
మూత్రపిండాల సమస్య: రెడ్ మీట్ లో కొలెస్ట్రాల్ స్థాయిలు, స్టాచు రేటెడ్ ఫ్యాటీ యాసిడ్ లు అధికంగా ఉంటాయి. వీటితో పాటు క్యాలరీలు (Calories) ఎక్కువగా ఉంటాయి. ఇవి అధికంగా శరీరానికి అందించడంతో మూత్రపిండాల సమస్యలు (Kidney problems) ఏర్పడతాయని ఒక తాజా అధ్యయనంలో తేలింది.
జీవితకాలం తగ్గుతుంది: మాంసాన్ని అతిగా తింటే జీవితకాలం (Lifetime) తగ్గుతుందని తాజాగా ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలింది. కనుక మాంసాన్ని (Meat) మితంగా తీసుకోవడం మంచిది. అతిగా తీసుకుంటే మన జీవితకాలాన్ని మనమే తగ్గించుకునేందుకు కారణం అవుతాం.
జీర్ణక్రియ, మలబద్దకం సమస్యలు: మాంసాన్ని అతిగా తిన్నప్పుడు జీర్ణాశయం (Gastrointestinal tract) అధిక ఒత్తిడికి లోనవుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ నిదానంగా పనిచేస్తుంది. తిన్న ఆహారం తొందరగా జీర్ణం కాదు. అలాంటప్పుడు మల విసర్జన సాఫీగా జరుగదు. వీటి కారణంగా మలబద్దకం (Constipation) సమస్యలు మొదలవుతాయి.
బరువు పెరుగుతారు: మాంసంలో జింక్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కొలెస్ట్రాల్ (Cholesterol) శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీర బరువు పెరిగి ఊబకాయ (Obesity) సమస్యలు ఏర్పడుతాయి.
గుండె సంబంధిత సమస్యలు: రెడ్ మీట్ లో అధిక మొత్తంలో ఉండే కొవ్వు శాతం గుండెపై ప్రభావం చూపుతుంది. అధికంగా మాంసాన్ని తింటే గుండెకు హాని కలుగుతుంది. దీంతో అధిక రక్తపోటు (High blood pressure), గుండె సమస్యలు (Heart problems) ఏర్పడతాయి.
క్యాన్సర్ ప్రమాదం: ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే రెడ్ మీట్ ను అతిగా తీసుకుంటే పేగు సంబంధిత క్యాన్సర్ (Intestinal cancer), బ్రెస్ట్ క్యాన్సర్ (Breast cancer) వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాంసం లో ప్రోటీన్ తో పాటు క్యాన్సర్ కు కారణమయ్యే క్యాన్సర్ కారకాలు, కొవ్వు శాతం అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కు దారితీస్తాయి.
తలనొప్పి: అధికంగా మాంసం తిన్నప్పుడు జీర్ణవ్యవస్థ అధిక ఒత్తిడికి (High pressure) లోనవుతుంది. దీంతో మనకు అలసిపోయిన భావన ఏర్పడుతుంది. అయితే దీని ప్రభావం మెదడుపై పడి తలనొప్పికి (Headache) కారణం అవుతుంది. కనుక మాంసాన్ని మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
నోటి దుర్వాసన: మాంసాహారంలో అధిక మొత్తంలో కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కొవ్వు పదార్థాలు శరీరంలో కీటోన్స్ (Ketones) ఉత్పత్తికి కారణమవుతాయి. దీని కారణంగా నోటిదుర్వాసన (Bad breath) ఏర్పడుతుంది.