- Home
- Technology
- Gadgets
- Mivi One 5G: రూ. 12 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. ఫీచర్ల విషయంలో తగ్గేదేలే
Mivi One 5G: రూ. 12 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. ఫీచర్ల విషయంలో తగ్గేదేలే
Mivi One 5G: దేశీయ టెక్నాలజీ బ్రాండ్ మివి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. కంపెనీ తన తొలి 5G మొబైల్ Mivi One 5Gని సెప్టెంబర్ 24, 2026న లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు.

6.75 అంగుళాల డిస్‌ప్లే..
మివి వన్ 5Gలో 6.75 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ అందించడంతో స్క్రోలింగ్, యాప్ నావిగేషన్ మరింత స్మూత్‌గా ఉండేలా రూపొందించారు. పనితీరు కోసం 4nm తయారీ ప్రక్రియపై రూపొందించిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 5G మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ ఉండటంతో వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందొచ్చు. ఫోన్ ప్యూర్ ఆండ్రాయిడ్ 16తో పనిచేస్తుంది. కంపెనీ రెండు సంవత్సరాల పాటు OS అప్‌డేట్లు అందించనున్నట్లు తెలిపింది.
కెమెరా విషయానికొస్తే..
ఫొటోగ్రఫీ కోసం మివి వన్ 5G వెనుక భాగంలో 50MP సామ్‌సంగ్ ISOCELL ప్రైమరీ సెన్సర్‌తో డ్యుయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. రోజువారీ ఫొటోలు, వీడియోల కోసం ఈ కెమెరా వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8MP కెమెరా ఉంటుంది. డిజైన్ విషయంలోనూ యువతను ఆకట్టుకునేలా పలు రంగుల్లో ఫోన్‌ను తీసుకొచ్చారు. బ్లూ, పింక్, గ్రీన్, బర్గండీ, నేవీ బ్లూ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
6000mAh బ్యాటరీ.. బాక్స్‌లోనే ఛార్జర్
బ్యాటరీ విషయంలో మివి వన్ 5Gలో 6000mAh కెపాసిటీని అందించారు. దీంతో సాధారణ వినియోగంలో ఎక్కువ సమయం ఫోన్‌ను ఛార్జింగ్ అవసరం లేకుండా ఉపయోగించే అవకాశం ఉంటుంది. బ్యాటరీని త్వరగా నింపేందుకు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా బడ్జెట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఉపయోగపడేలా ఛార్జింగ్ అడాప్టర్‌ను బాక్స్‌లోనే అందిస్తున్నారు. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవం ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తుంది.
ఇంటి నుంచే సర్వీస్.. 7 రోజుల్లో రిపేర్ కాకపోతే కొత్త ఫోన్
Mivi One 5Gతో పాటు కంపెనీ Mivi Care+ పేరుతో ప్రత్యేక సర్వీస్ సదుపాయాన్ని అందిస్తోంది. ఫోన్‌లో సమస్య తలెత్తినప్పుడు కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే సేవలు పొందే అవకాశం ఉంటుంది. కంపెనీ ఫోన్‌ను కస్టమర్ నుంచి పికప్ చేసుకుని మరమ్మతులు పూర్తయ్యాక తిరిగి డెలివరీ చేస్తుంది. ఏదైనా కారణంతో ఏడు రోజుల్లో రిపేర్ పూర్తి కాకపోతే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని Mivi చెబుతోంది. దేశవ్యాప్తంగా కంపెనీకి సుమారు 500 సర్వీస్ సెంటర్లు ఉన్నాయని వెల్లడించింది.
మూడు వేరియంట్లు.. బిగ్ బిలియన్ డేస్‌లో రూ.11,999 నుంచి
మివి వన్ 5Gను 4జీబీ+128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో తీసుకొచ్చారు. సాధారణ ధరలు వరుసగా రూ.14,999, రూ.15,999, రూ.16,999గా ఉన్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా నెట్ ఎఫెక్టివ్ ధరలు రూ.11,999, రూ.12,999, రూ.13,999 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అక్టోబర్ 8, 2026 అర్థరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభంకానున్నాయి. వీటితో పాటు అదనంగా ఎంపిక చేసిన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

