Custard Apple: పొరపాటున సీతాఫలం గింజ మింగితే ఏమౌతుంది..?
Custard Apple: సీతాఫలం గింజల్లో అనోనాసిన్ (Annonacin) అనే సహజ టాక్సిన్ ఉంటుంది. ఇది ఒక రకమైన న్యూరోటాక్సిన్. అంటే నరాల వ్యవస్థ పై ప్రభావం చూపించే విష పదార్థం. ఈ పదార్థం గింజల పొరలో దాగి ఉంటుంది.

సీతాఫలం..
సీతాఫలం చాలా మందికి నచ్చే పండు. చలికాలంలో మనకు ఈ పండు లభిస్తుంది. ఈ సీజన్ ఫ్రూట్ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. రుచి మాత్రమేకాదు... పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి. సీతాఫలంలో విటమిన్ సి, బి6, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అయితే.. ఈ పండు మొత్తం గింజలతోనే నిండి ఉంటుంది. దీనిని తినడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే... వీటిని తినే క్రమంలో చాలా మంది గింజలను మింగేస్తూ ఉంటారు. అసలు, ఇది మంచిదేనా? సీతాఫలం గింజలను మింగితే ఏమౌతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం....
సీతాఫలం గింజల్లో ఏముంటుంది..?
సీతాఫలం గింజల్లో అనోనాసిన్ (Annonacin) అనే సహజ టాక్సిన్ ఉంటుంది. ఇది ఒక రకమైన న్యూరోటాక్సిన్. అంటే నరాల వ్యవస్థ పై ప్రభావం చూపించే విష పదార్థం. ఈ పదార్థం గింజల పొరలో దాగి ఉంటుంది. గింజ నమిలినప్పుడు, విరిగినప్పుడు అది బయటకు వస్తుంది. అందుకే గింజ పగల కొట్టి తినడం, నమలడం ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు.
పొరపాటున సీతాఫలం గింజ మింగితే ఏమౌతుంది?
సాధారణంగా, సీతాఫలం గింజలు చాలా గట్టిగా ఉంటాయి. అవి అంత సులభంగా జీర్ణం కావు. కాబట్టి, చాలా సందర్భాల్లో అవి సహజంగా మలంతో పాటే బయటకు వచ్చేస్తాయి. కాబట్టి, ఒకటి లేదా రెండింటిని మింగలడం వల్ల ఏమీ కాదు. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ, ఎక్కువ గింజలు మింగడం మాత్రం అంత మంచిదేమీ కాదు. ఎక్కువ గింజలు మింగితే, గింజలలోని విష పదార్థం శరీరంలోకి వెళ్తే వాంతులు, కడుపులో నొప్పి, తలనొప్పి, మలబద్దకం వంటి సమస్యలు రావచ్చు. చాలా అరుదైన సందర్భాల్లో అనోనాసిన్ అధిక అధిక మోతాదులో శరీరంలోకి వెళ్తే... నరాల వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.అందుకే.. ఈ పండు తినే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.
సీతాఫలం గింజ మింగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....
పొరపాటున గింజ మింగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే నీరు ఎక్కువగా తాగాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థను ఆ గింజ దెబ్బ తినకుండా.. సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది. తలనొప్పి, వాంతులు, పొట్ట ఉబ్బరంగా ఉండటం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యులు అవసరమైతే గ్యాస్ట్రిక్ లావేజ్ (పొట్ట శుభ్రపరచడం) వంటి చికిత్సలు చేయవచ్చు.
సీతాఫలం తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....
పండు తింటున్నప్పుడు గింజలను ఒకదాని తర్వాత ఒకటి చేత్తో తీసేయడం ఉత్తమం. పిల్లలకు సీతాఫలం ఇచ్చినప్పుడు.. వారు గింజను మింగకుండా జాగ్రత్తగా చూడాలి.
ఆసక్తికరమైన విషయం...
సీతాఫలం గింజలను కొన్ని ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగిస్తారు — ఉదాహరణకు జుట్టులో జిడ్డు వంటి సమస్యల నివారణ కోసం ఉపయోగిస్తారు. కానీ.. తినడానికి మాత్రం పనికిరావు.
ఫైనల్ గా...
సీతాఫలం తినడం శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ గింజలు మాత్రం తీసుకోకూడదు. పొరపాటున ఒకటి రెండు మింగిపోతే పెద్దగా ఆందోళన అవసరం లేదు, కానీ ఎక్కువ మింగినట్లయితే వైద్యుని సంప్రదించడం మంచిది.