పొద్దున చేసినా.. రాత్రికి చపాతీ మెత్తగా ఉండాలంటే ఏం చేయాలి?
చపాతీలు మెత్తగా, మృదువుగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. మరి.. చపాతీ చేసి ఎన్ని గంటలైనా మెత్తగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
మన రోజువారీ ఆహారంలో చపాతీ కూడా ఒక భాగం. మన దేశంలో చాలా మంది రోజూ ఆహారంగా చపాతీ తింటూ ఉంటారు. దీనిలో చాలా పోషకాలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే చాలా మంది అన్నానికి బదులు చపాతీ తింటూ ఉంటారు. బరువు తగ్గాలి అనుకునేవారు కూడా వీటిని తినడానికే ఎక్కువ ప్రయార్టీ ఇస్తారు. ఇవి తినడానికి బాగుంటాయి కానీ.. చేసిన కాసేపటికే గట్టిగా మారిపోతూ ఉంటాయి. అలా కాకుండా.. ఉదయం చేసినా.. రాత్రి వరకు కూడా చపాతీ మెత్తగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
నూనెకు బదులు నెయ్యి: కొంతమంది చపాతీ మెత్తగా ఉండటానికి పిండి చేసేటప్పుడు నూనె, ఉప్పు కలుపుతారు. దీనివల్ల చపాతీ రుచి కొద్దిగా భిన్నంగా ఉండటమే కాకుండా, కొంత సమయం తర్వాత గట్టిపడుతుంది. కాబట్టి, చపాతీ ఎక్కువసేపు రుచిగా, మెత్తగా ఉండటానికి నూనెకు బదులుగా మీరు నెయ్యిని ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల చపాతీ ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది. అంతేకాకుండా నూనెకు బదులుగా నెయ్యిని ఉపయోగిస్తే అది ఆరోగ్యానికి కూడా మంచిది.
తగినంత నీరు : అత్యవసర పరిస్థితుల్లో పిండి చేసేటప్పుడు మనలో చాలామంది ఎక్కువ నీరు కలిపి పిండి చేస్తాము. దీనివల్ల చపాతీ త్వరగా గట్టిపడుతుంది. కాబట్టి పిండి చేసేటప్పుడు తగినంత నీరు కలిపి పిండి చేస్తే చపాతీ ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది.
చపాతీ తయారీ చిట్కాలు
పాలు లేదా వేడి నీరు : చపాతీ పిండి చేసేటప్పుడు నీటికి బదులుగా పాలు లేదా వేడి నీరు కలిపి పిండి చేయవచ్చు. కనీసం 15 నిమిషాల పాటు పిండిని పిసికి కలుపుకోవాలి. తర్వాత కొంత సమయం అలాగే ఉంచి, ఉండలుగా చేసి చపాతీ చేస్తే చపాతీ మెత్తగా వస్తుంది. అంతేకాకుండా ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది.
పగుళ్లు ఉండకూడదు : మీరు చపాతీని చపాతీ కర్రతో చుట్టేటప్పుడు దానిలో పగుళ్లు ఉండకూడదు. పగుళ్లు ఉంటే చపాతీ త్వరగా గట్టిపడుతుందని గుర్తుంచుకోండి.
చపాతీ తయారీ విధానం
చపాతీ కాల్చే విధానం : మీరు చపాతీని కాల్చేటప్పుడు దాని పైభాగంలో బుడగలు వచ్చిన వెంటనే వెంటనే మరోవైపు తిప్పి వేయండి. తర్వాత దాని ఉపరితలంపై నూనె రాసుకోండి. ఈ విధంగా మీరు చపాతీ కాల్చినట్లయితే చపాతీ ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది.
గుర్తుంచుకోండి :
- ముఖ్యంగా చపాతీని ఒక్కొక్కటిగా కాల్చి పేర్చేటప్పుడు దానిపై నెయ్యి రాసుకోండి. దీనివల్ల చపాతీ తేమను కోల్పోదు.
- అలాగే మీరు చపాతీని అల్యూమినియం ఫాయిల్, జిప్ లాక్ బ్యాగ్ వంటి వాటిలో ఉంచండి. దీనివల్ల చపాతీ ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది.