గోధుమ చపాతీలు కాదు.. ఈ పిండి రోటీలు తినండి ఆరోగ్యంగా ఉంటారు
చాలా మంది గోధుమ పిండితో చేసిన చపాతీలనే తింటుంటారు. ఇవొక్కటే హెల్తీగా ఉంటాయని అనుకుంటారు. కానీ వేరే పిండితో చేసిన రోటీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోటీ
వైట్ రైస్ ను ఇష్టంగా తినేవారుచాలా మంది ఉన్నారు. కానీ ఈ వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బరువును బాగా పెంచుతాయి. రైస్ ను ఎక్కువగా తింటే పక్కాగా ఊబకాయం బారిన పడతాం. అందుకే ఈ రోజుల్లో చాలా మంది అన్నానికి బదులుగా చపాతీలను తింటున్నారు. ముఖ్యంగా గోధుమ పిండితో చేసిన వాటిని. కానీ మీరు వీటికి బదులుగా వేరే పిండితో చేసిన రోటీలను కూడా తినొచ్చు. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రాగి పిండి రొట్టె
రాగులు మంచి పోషకాలున్న చిరుధాన్యాలు. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని డయాబెటీస్ పేషెంట్లు ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. ఇది షుగర్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. రాగులతో రోటీలను తయారుచేసుకుని తినొచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.
అమరాంత్
మీరు గోధుమ పిండి చపాతీలకు బదులుగా అమరాంత్ పిండి రోటీలను తినొచ్చు. ఈ పిండిలో గ్లూటెన్ ఉండదు. కానీ ప్రోటీన్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అలాగే లైసిన్ కూడా ఉంటుంది. దీనిలో అమైనో ఆమ్లం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ పిండితో చేసిన రోటీలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
సజ్జలు
సజ్జలతో చేసిన రోటీలను మీరు గోధుమ పిండి చపాతీలకు బదులుగా తినొచ్చు. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఎముకల్ని బలంగా చేయడానికి సహాయపడతాయి. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచి చలికాలంలో రక్షణగా ఉంటాయి.
మొక్కజొన్న రొట్టె
గోధుమ చపాతీలకు బదులుగా మీరు మొక్కజొన్న రొట్టెను కూడా తినొచ్చు. మీకు తెలుసా? పంజాబీ వంటకాల్లో ఇది చాలా ముఖ్యమైనవి. ఈ మొక్కజొన్న పిండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
జొన్న రొట్టె
జొన్న రొట్టెలను ఎక్కువగా గ్రామాల్లోనే తింటుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. వీటిలో గ్లూటెన్ ఉండదు. ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రొట్టె మన కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది మధుమేహులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.