ఉల్లిలో ఇంత శక్తి ఉందా?
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఉల్లిది కీలక పాత్ర అనడంలో అతిశయోక్తి లేదు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఉల్లి అమోఘమైన విశిష్టతలు వెలుగు చూస్తున్నాయి. సర్వరోగ నివారిణి అయిన ఉల్లి గొప్పతనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్లు ఏర్పడనీయదు
మూత్ర పిండాల పనితీరును ఉల్లి మెరుగుపరుస్తుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును తగ్గించడం, నియంత్రించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
గుండె, రక్తనాళాలకు రక్షణ
ఉల్లిపాయలను రోజూ వాడటం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరచడం ద్వారా హార్ట్ ఎటాక్, కవాటాలు మూసుకుపోవడం తదితర జబ్బులు రాకుండా సహాయపడుతుంది.
నరాలకు, మెదడుకు చిక్సిత
ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వల్ల నరాలకు సంబంధించిన రోగాలు నయం కావడానికి ఉపయోగపడతాయి. ఇవి మెదడు కణాలను ఒత్తిడి నుంచి రక్షించడానికి సహాయపడతాయి. ఆయుర్వేదంలో కామెర్ల చికిత్సలోనూ ఉల్లి రసాన్ని ఉపయోగిస్తారు.
కంటి శుక్లాలకు అడ్డుకట్ట
కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా నిరోధించడంలో ఉల్లి సహాయపడుతుంది. రెగ్యులర్‌గా వీటిని ఉపయోగించడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మహిళలకు మెరుగైన ఆరోగ్యం
ఉల్లి టీ తాగడం, పచ్చి ఉల్లిపాయలను ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఉల్లి ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ(మంటను తగ్గించే) లక్షణం మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. మొటిమలు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉల్లి రసాన్నితేనెతో కలిపి రాయడం వల్ల తగ్గిపోతాయి.
మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం
రక్త ప్రసరణను మెరుగుపరిచే సామర్థ్యం ఉల్లిపాయలకు ఉండటం వల్ల మైగ్రేన్ తలనొప్పి నివారణ చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు. ఉల్లి పేస్టును నుదుటిపై రాయడం ద్వారా ఉపశమనం పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
గాయాలకు మందు
గాయాలు, మచ్చలను ఉల్లి నయం చేస్తుంది. దాని రసాన్ని దెబ్బతగిలిన ప్రాంతంలో పూయడం ద్వారా ఇన్ఫ్‌క్షన్లు సోకకుండా కాపాడవచ్చు.
జుట్టు సంరక్షణకు..
ఉల్లిపాయ రసాన్ని తల వెంట్రుకలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుతుంది. చుండ్రు తగ్గుతుంది. కుదుళ్లు బలంగా మారతాయి. ఉల్లిలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. తలలో రక్త ప్రసరణకు సహాయం చేస్తుంది.
కీటకాలు కుట్టినప్పుడు..
తేనెటీగ, కందిరీగ, దోమలు వంటి కీటకాలు కుట్టినప్పుడు నొప్పి, వాపు తగ్గడానికి ఉల్లిని ఉపయోగించవచ్చు. ఉల్లి ముక్క తీసుకొని నేరుగా నొప్పి ఉన్నచోట నెమ్మదిగా రుద్దడం ద్వారా వాపు, నొప్పి తగ్గించవచ్చు.