Masala Vada Recipe: ఈ చిన్న సీక్రెట్ తో పర్ఫెక్ట్ మసాలా వడ
Masala Vada Recipe: శెనగపప్పు గారెలు. క్రిస్పీగా, మధ్యలో పచ్చిమిరపకాయలతో కారంగా, టీ తాగుతూ తింటే నోట్లో నీళ్లు రావాల్సిందే. సౌత్ ఇండియన్స్ కు ఇష్టమైన స్నాక్ ఏదైనా ఉందంటే శెనగపప్పు గారెలే. ఇవి హోటల్ స్టైల్ లో కరకరలాడాలంటే...ఈ టిప్ ఫాలో అయిపోండి.

చాయ్‌తో పాటు శెనగపప్పుగారెలు ఉండాల్సిందే
ప్రతి ఒక్కరికీ టీ టైమ్ అంటే చాలా మందికి చాయ్‌తో పాటు కరకరలాడే స్నాక్స్ గుర్తుకొచ్చేస్తాయి. సమోసా, రకరకాల బజ్జీలు, పకోడీ, పునుగులతో పాటు శెనగపప్పు గారెలకు ప్రత్యేక స్థానం ఉంది. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి మృదువుగా ఉండే ఈ మసాలా వడ రుచిలో భలే ఉంటుంది. ఇంట్లోనే తక్కువ పదార్థాలతో ఈ గారెలను సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచు? వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం.
కనీసం రెండు గంటలు నానబెట్టాలి
ఈ శెనగపప్పు గారెల కోసం ముందుగా శెనగపప్పును బాగా కడిగి కనీసం రెండు గంటలు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల వడలు మెత్తగా వస్తాయి. తరువాత నీటిని పూర్తిగా వంపేసి మిక్సీ జార్‌లో వేయాలి. జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి ముందుగా మసాలా పొడిని తయారు చేయాలి. ఆపై నానబెట్టిన శెనగపప్పు, ఉప్పు కలిపి పూర్తిగా ముద్దలా కాకుండా కొద్దిగా ముదురు టెక్స్చర్‌తో గ్రైండ్ చేయాలి. కొంత నానబెట్టిన పప్పును పక్కన పెట్టుకుంటే వడలు మరింత కరకరలాడుతాయి.
అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలపాలి. అన్ని పదార్థాలు బాగా కలిసేలా మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. తరువాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి.
అతిథుల మనసు దోచుకోవచ్చు
పాన్‌లో నూనె వేడి చేసి మీడియం మంటపై వడలను నెమ్మదిగా వేయించాలి. అవి బంగారు రంగులోకి మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. బయట కరకరగా, లోపల మెత్తగా తయారైన చనా దాల్ వడలను వేడి వేడిగా తీస్తుంటేనే స్మెల్ అదిరిపోద్ది. టమాటో సాస్ లేదా పచ్చి చట్నీతో తింటే...రుచిగా ఉంటాయి. సాయంత్రం టీతో కలిపి తింటే ఈ స్నాక్ మరింత ఆస్వాదించవచ్చు. ఇంట్లో అతిథులు వచ్చినప్పుడు కూడా ఇది మంచి ఆప్షన్ గా చేసుకోవచ్చు.

