బాదం కన్నా పల్లీలే మంచివి.. వీటిని ఎలా తినాలంటే?
Peanut Benefits: పల్లీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి కూడా మనం రోజూ తినే డ్రై ఫ్రూట్స్ లాగే మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. కానీ వీటిని కొన్ని పద్దతుల్లోనే తినాలి. అప్పుడే వీటిలోని పోషకాలు మనకు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పల్లీల ప్రయోజనాలు
పల్లీలను ఎలా తిన్నా టేస్టీగా ఉంటాయి. కొంతమంది వీటిని వేయించుకుని తింటే మరికొంతమంది ఉడకబెట్టుకుని తింటుంటారు. ఉడికించినా, వేయించినా పల్లీలతో మనకు ఎన్నో పోషకాలు అందుతాయి. 100 గ్రాముల పచ్చి పల్లీల్లో 567 కేలరీలు ఉంటాయి. అందుకే పల్లీలను పేదల బాదం పప్పు అంటారు.
పల్లీల లోని పోషకాలు
పల్లీలలో ప్రోటీన్ - 25.8 గ్రా, కార్బోహైడ్రేట్ - 16.1 గ్రా, చక్కెర - 4.7 గ్రా, ఫైబర్ - 8.5 గ్రా, ఒమేగా-6 - 15.56 గ్రా ఉంటాయి. అలాగే వీటిలో ఫోలేట్, విటమిన్ ఇ, బయోటిన్, మాంగనీస్, నియాసిన్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో సూక్ష్మపోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.
రోజూ ఎన్ని పల్లీలను తినాలి?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజూ గుప్పెడు పల్లీలను తింటే మంచిది. దీనిలోని మంచి కొవ్వు మనకు అందుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గడం ప్రారంభమవుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాదు ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. అలాగే కండరాలను బలంగా ఉంచేందుకు తోడ్పడుతాయి. అయితే చాలా మందికి పల్లీలను తినేటప్పుడు కొన్ని తప్పులను చేస్తారు. దీనివల్లే వీటి పోషకాలను పొందరు. అవేంటంటే?
ఎక్కువ తినొద్దు
కొంతమంది తినడం స్టార్ట్ చేశారంటే వీటిని ఎంత తింటున్నామో తెలియకుండా తింటుంటారు. కానీ పల్లీల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని అతిగా తింటే బరువు పెరుగుతారు. అలాగే కొంతమందికి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అందుకే వీటిని అతిగా తినకూడదు.
పచ్చి పల్లీలను తింటే?
పచ్చిపల్లీలు టేస్టీగా ఉంటాయి. అలాగే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కానీ వీటిని ఎక్కువగా తింటే గనుక జీర్ణ సమస్యలు రావొచ్చని నిపుణులు అంటున్నారు. అందుకే వీటిని వేయించి లేదా ఉడికించి తొన్చు. దీనివల్ల మీకు ఎలాంటి జీర్ణ సమస్యలు రావు. వీటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారు.