ఉడికించిన గుడ్డు పెంకులను ఈజీగా ఎలా తొలగించాలి?
Eggs Shell: గుడ్లను ఉడికించడం ఈజీనే. కానీ కొన్ని కొన్ని సార్లు ఉడికించిన గుడ్డు పెంకులను ఒలచడం కష్టంగా ఉంటుంది. చాలా సార్లు ఈ పెంకులను తీసేస్తుంటే గుడ్డు కూడా దానితో పాటు వస్తుంటుంది. దీన్ని ఈజీగా ఎలా తీసేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గుడ్డు పెంకులను తొలగించే చిట్కాలు
రోజూ ఒక గుడ్డును తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడం నుంచి గుండె ఆరోగ్యం మెరుగుపడటం, బరువు తగ్గడం, ఒంట్లో శక్తి పెరగడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఆదివారమైనా, సోమవారమైనా గుడ్డును ప్రతిరోజూ తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తుంటారు. అయితే గుడ్డును ఉడకబెట్టిన తర్వాత దాని పెంకులను తీసేయడం కష్టంగా ఉంటుంది. చాలా సార్లు ఈ పెంకులు అంత ఈజీగా రావు. పెంకులతో పాటుగా గుడ్డు కూడా దానికి అంటుకుని వస్తుంటుంది. అందుకే ఈ పెంకులను చాలా ఈజీగా గుడ్డు నుంచి ఎలా తీసేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గుడ్డు పెంకులను ఈజీగా తొలగించాలంటే ఏం చేయాలి?
ఈ టెక్నిక్ వాడండి
గుడ్లను వేడి మంటమీద ఉడికిస్తే కూడా గుడ్డు పెంకులను సులువుగా తొలగించొచ్చు. ఇందుకోసం మంట ఎక్కువ పెట్టి నీళ్లను ముందుగా మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో గుడ్లను వేసి 12 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత ఐస్, చల్ల నీళ్లు ఉన్న నీళ్లలో గుడ్లను వేయండి. ఇందులో నాలుగు నిమిషాలు ఉంచిన తర్వాత పెంకులను తీసేస్తే ఈజీగా వస్తాయి. పెంకులను తీయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఉప్పు నీళ్లలో ఉడకబెట్టండి
గుడ్డు పెంకులను సులువుగా తొలగించడానికి మీరు ఉప్పు నీళ్లను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం మరుగుతున్న నీళ్లలో కొంచెం ఉప్పును వేసి గుడ్లను వేయండి. నీళ్లలో ఉప్పును వేయడం వల్ల గుడ్డు పెంకులు సులువుగా ఊడిపోవడంతో పాటుగా గుడ్లు పగిలే అవకాశం కూడా తగ్గుతుంది.
బేకింగ్ సోడాను కూడా వాడండి
గుడ్డు పెంకులను ఈజీగా తీసేయడానికి బేకింగ్ సోడాను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం టీ స్పూన్ బేకింగ్ సోడాను గుడ్లు ఉడుకుతున్న నీళ్లలో వేసి మరిగించండి. ఉప్పు లాగే బేకింగ్ సోడా కూడా గుడ్డు పెంకులను సులువుగా వచ్చేలా చేయడానికి సహాయపడుతుంది. అలాగే మీరు వెనిగర్ ను కూడా ఉపయోగించొచ్చు. నీళ్లు వేడిగా అయిన తర్వాత అందులో ఒకటి లేదా రెండు టీస్పూన్ల వెనిగర్ ను వేసి గుడ్లను ఉడకబెట్టండి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా గుడ్డు పెంకులు తొలగిపోతాయి.
ఈ టైంలో గుడ్డు పెంకులను తీసేయకండి
గుడ్ల పెంకులు ఈజీగా రావాలంటే గుడ్లు వేడిగా ఉండకూడదు. అందుకే గుడ్లు పూర్తిగా చల్లారిన తర్వాత పెంకులను తీసేయండి. ఇందుకోసం ఉడికిన గుడ్లను చల్లనీళ్లలో వేయండి.