ఉదయాన్నే ఈ టీ తాగితే ఎక్సర్ సైజ్ చేయకపోయినా బరువు తగ్గుతారు
కొంతమంది ఎలాంటి వ్యాయామం గానీ, శారీరక శ్రమ గానీ లేకుండా బరువు తగ్గాలనుకుంటారు. ఇలాంటి వారు ఉదయాన్నే కొన్ని రకాల టీలు తాగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అవేంటంటే?
ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇది ఒక రోగం కాకపోయినా ఇది ఎన్నో రోగాలకు మాత్రం దారితీస్తుంది. అందుకు పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
డైట్ ను ఫాలో అవ్వడం, జిమ్ముల్లో చెమటలు చిందించడం లాంటివి చేస్తుంటారు. అయితే కొంతమంది బిజీగా ఉండటం వల్ల ఇలాంటివేమీ చేసేంత టైం ఉండదు. ఇలాంటి వారు ఎలాంటి శ్రమ లేకుండా బరువు తగ్గొచ్చు. కానీ ఈ చిట్కాలను మాత్రం రోజూ పాటించాలి. అప్పుడే త్వరగా బరువు తగ్గుతారు.
చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది బరువు తగ్గడం కష్టంగా మారింది. అయితే కొన్ని మూలికా టీలు మాత్రం బరువు తగ్గడానికి సహాయపడతాయి. మీరు వీటితో బరువు తగ్గాలంటే ఉదయం పాలు, పంచదార కలిపిన టీ కి బదులుగా వీటిని తాగాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బరువు తగ్గించే మూలికా టీలు
దల్చిన చెక్క టీ
దాల్చిన చెక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దాల్చిన చెక్క టీ బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీరు దాల్చిన చెక్కతో టీ తయారుచేసుకుని తాగితే బరువు తగ్గడమే కాదు మీ శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ దాల్చిన చెక్క టీని తయారుచేయడానికి కప్పు నీళ్లు, ఒక చెంచా తేనె, కొంచెం నిమ్మరసం, ఒక ముక్క దాల్చిన చెక్క తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో దాల్చిన చెక్క వేసి బాగా మరిగించండి. తర్వాత దీన్ని వడకట్టి అందులో నిమ్మరసం, తేనె వేసి కలుపుకుని తాగండి. దీన్ని రోజూ తాగితే మీరు బరువు ఖచ్చితంగా తగ్గుతారు.
బరువు తగ్గించే టీ
జీలకర్ర టీ:
జీలకర్ర టీ కూడా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు జీలకర్ర టీని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఈ టీని తయారుచేయడం చాలా సులువు. ఇందుకోసం ముందుగా ఒక కప్పు నీళ్లలో ఒక చెంచా జీలకర్ర వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి. ఈ నీళ్లు సగం అయిన తర్వాత వడకట్టి అందులో తేనె, నిమ్మరసం కలిపి తాగండి. ఇలా రోజూ తాగితే మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.
బ్లాక్ టీ:
మిల్క్ టీ కంటే బ్లాక్ టీనే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు గనుక ప్రతిరోజూ ఉదయం బ్లాక్ టీ తాగితే తొందరగా బరువు తగ్గుతారు. ఈ బ్లాక్ టీ మీ జీవక్రియను పెంచుతుంది. దీంతో మీరు బరువు తగ్గుతారు. ఈ బ్లాక్ టీని తయారుచేయడం చాలా ఈజీ. గిన్నెలో నీళ్లు, టీ పొడి వేడి బాగా మరిగించాలి. దీన్ని వడకట్టి తాగాలి. అయితే దీనిలో చక్కెర వేసుకోకూడదు.
మూలికా టీల ప్రయోజనాలు
గ్రీన్ టీ:
బరువు తగ్గడానికి బెస్ట్ టీ గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీని తయారుచేయడం చాలా ఈజీ. ఈ టీని మీరు ఉదయాన్నే కాకుండా సాయంత్రం కూడా తాగొచ్చు. రోజుకు రెండు సార్లు గ్రీన్ టీ తాగితే మీ జీవక్రియ మెరుగుపడి మీరు బరువు తొందరగా తగ్గుతారు. వీటితో పాటుగా సోంపు టీ, పుదీనా టీ, అల్లం టీ లాంటి టీలు తాగినా మీరు బరువు తగ్గుతారు.