కాకరకాయ కూర చేదు కాకూడదంటే ఏం చేయాలో తెలుసా?
Bitter Gourd: కాకరకాయల ఎన్నో పోషకాలు, ఔషదగుణాలున్న కూరగాయ. కానీ చాలా మంది ఈ కూరను తినడానికి అస్సలు ఇష్టపడరు. కారణం ఇది చేదుగా ఉంటుందని. కానీ కొన్ని పద్దతులను ఫాలో అయితే మాత్రం ఈ కూర చేదు కాకుండా చేయొచ్చు. అదెలాగంటే?

కాకరకాయ కూర చేదు కాకూడదంటే ఏం చేయాలి
ఆరోగ్యకరమైన కూరగాయల్లో కాకరకాయ ఒకటి. ఇది చేదుగా ఉన్నా.. మన ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. అందుకే దీన్ని ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. షుగర్ పేషెంట్లకు, హార్ట్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు ఇదొక వరమనే చెప్పాలి. ఈ కాకరకాయ కూరను తినడం వల్ల ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటారు. ఈ కూను తింటే జీర్ణక్రియ మెరుగుపడటం నుంచి డయాబెటీస్ కంట్రోల్ అవడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
కాకరకాయతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నా.. చాలా మంది దీన్ని తినడానికి మాత్రం ఇష్టపడరు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుందని. కానీ కొన్ని పద్దతలను పాటిస్తే మాత్రం ఈ చేదును పోగొట్టి కూరను టేస్టీగా చేయొచ్చు. వీటివల్ల కాకరకాయలోని పోషకాలు ఏమాత్రం తగ్గవు. కాబట్టి ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కాకరకాయ చేదు పోవాలంటే ఏం చేయాలి?
కాకరకాయ ముక్కలపై ఉప్పు జల్లండి
కాకరకాయ పైపొట్టును తొలగించని వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారు కాకరకాయను సన్నగా కట్ చేసుకోవాలి. దీనిపై కొంచెం ఉప్పును చల్లాలి. అర్థగంట పాటు దానిపై మూతపెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు వల్ల కాకరకాయలోని చేదు బయటకు వస్తుంది. ఇప్పుడు కాకరకాయను బాగా కడిగితే సరిపోతుంది. చేదు చాలా వరకు పోతుంది.
గోరువెచ్చని నీళ్లలో నానబెట్టండి
గోరువెచ్చని నీళ్లను ఉపయోగించి కూడా మీరు కాకరకాయ చేదును పోగొట్టొచ్చు. ఇందుకోసం కాకరకాయలను తరిగి 15 నుంచి 20 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్లలో వేసి నానబెట్టండి. దీనివల్ల చేదు చాలా వరకు తగ్గిపోతుంది. దీంట్లో మీరు కొంచెం ఉప్పును కూడా కలపొచ్చు.
నిమ్మరసాన్ని ఉపయోగించండి
నిమ్మరసంతో కూడా మీరు కాకరకాయ చేదును పోగొట్టొచ్చు. ఇందుకోసం కాకరకాయ ముక్కలపై నిమ్మరసాన్ని పిండండి. దీన్ని 20 నిమిషాలు ఉంచి తర్వాత కడగండి. నిమ్మకాయ కాకరకాయ చేదును తగ్గించి కాకరకాయ కూర టేస్టీగా అయ్యేలా చేయడానికి సహాయపడుతుంది.
వెనిగర్, చక్కెరను వాడండి
కాకరకాయ చేదును పోగొట్టడానికి మీరు చక్కెర, వెనిగర్ ను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఈ రెండింటిని మిక్స్ చేసి కాకరకాయను కొద్దిసేపు మెరినేట్ చేయండి. చక్కెరలోని తీపి, వెనిగర్ లోని ఆమ్లత్వం కాకరకాయలోని చేదును తగ్గించేందుకు సహాయపడతాయి.
పెరుగులో మెరినేటింగ్
పెరుగుతో కూడా కాకరకాయ చేదును తగ్గించొచ్చు. ఇందుకోసం పెరుగులో కాకరకాయ ముక్కలను ముంచి అర్థగంట పాటు పక్కన పెట్టండి. పెరుగులోని లాక్టిక్ యాసిర్ కాకరచేదును తగ్గించి కూర టేస్టీగా కావడానికి సహాయపడుతుంది.
కాకరకాయ ముక్కలను మరిగించండి
కాకరకాయ చేదును పోగొట్టడానికి నీళ్లలో కూడా కొంచెం సేపు మరిగించొచ్చు. ఇందుకోసం కాకరకాయను ముక్కలుగా కోసి ఉప్పు వేసిన నీళ్లలో కొంచెం సేపు మరిగించండి. ఆ తర్వాత చల్ల నీళ్లతో ఈ కాకరకాయ ముక్కలను కడిగేస్తే సరిపోతుంది. ఇలా మరిగించడం వల్ల కాకరకాయలోని చేదు రసం రిలీజ్ అవుతుంది. దీంతో కూర మరింత టేస్టీగా అవుతుంది. చేదు కూడా కాదు.
కాకరకాయ విత్తనాలను తీసేయండి
కాకరకాయ కూర చేదుగా కావడానికి దానిలోపలుండే గింజలు, తెల్లని గుజ్జే కారణం. ఇవి చాలా చేదుగా ఉంటాయి. అందుకే ఈ కాకరకాయ కూర చేదుగా కావొద్దంటే గింజలను, తెల్లని గుజ్జును తీసేసి వంట చేయండి. దీనివల్ల కూర కూడా మరింత టేస్టీగా అవుతుంది.
మజ్జిగలో నానబెట్టండి
కాకరకాయ చేదును తొలగించడానికి మీరు మజ్జిగను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం కాకరకాయ ముక్కలను మజ్జిగలో వేసి కొద్దిసేపు నానబెట్టండి. దీనివల్ల ఈ కూరగాయ చేదు చాలా వరకు తగ్గుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పద్దతిలో కాకరకాయ కూరను చేయడం వల్ల ఇది తొందరగా ఉడుకుతుంది. అలాగే బాగా అరుగుతుంది కూడా.
కాకరకాయను ఇలా కోయండి
కాకరకాయను పై పొట్టుకూడా చాలా చేదు ఉంటుంది. కాబట్టి కాకరకాయ పై భాగాన్ని తీసేయండి. అలాగే దీన్ని నిలువుగా ఒక చీలిక పెట్టి సగానికి కోయండి. ఆ తర్వాతే వీటిని మీకు కావాల్సినట్టు ముక్కలు చేయండి. అలాగే కాకరకాయల్లో గింజలు మరీ గట్టిగా ఉంటే వాటిని తొలగించండి.
కోసిన కాకరకాయ ముక్కలను ఒక పెద్దగిన్నెలోకి తీసుకుని అందులో కొంచెం ఉప్పును వేయండి. అంటే నాలుగు మీడియం సైజు కాకరకాయలకు 1 టేబుల్ స్పూన్ ఉప్పు కలిపితే సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నింటీని ఉప్పు బాగా పట్టేలా కలపాలి. దీన్ని 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
కాకరకాయ ముక్కల్లో ఉప్పును వేయడం వల్ల వాటి నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ముక్కలను బాగా పిండి రసాన్ని తీయాలి. వీటి నుంచి వీలైనంత రసం తీసేస్తే కాకరకాయ చేదు పోతుంది. ఆ తర్వాత కాకరకాయ ముక్కలను శుభ్రమైన నీళ్లతో కడగాలి. దీంతో ముక్కలకు పట్టిన ఉప్పు పోతుంది.
కాకరకాయలు నీళ్లను బాగా పీల్చుకుంటాయి. కాబట్టి వేళ్లతో ఈ వాటర్ ను పిండేయండి. రెండుమూడు సార్లు పిండితే కాకరకాయలోని చేదు పోతుంది. అంతే మీకు కావాల్సిన కాకరకాయ కూరను తయారుచేసుకుని తినొచ్చు.